సంక్షోభం నుంచి ఎదిగిన నాయకుడిగా నారా లోకేష్..!!
నారా లోకేష్.. రాజకీయంగా అడుగులు ప్రారంభించిన సమయంలో ఎన్నో అవమానాలు... మరెన్నో విమర్శలు. చంద్రబాబు వారసుడిగా ఎదగలేరనే విశ్లేషణలు. ఎమ్మెల్యేగా పోటీ చేసిన తొలి ఎన్నికలోనే పరాజయం.పప్పు అంటూ ప్రతిపక్షాల నుంచి అవహేళనలు. అయిదేళ్ల కాలంలో ఎదురైనా సంక్షోభాలను లోకేష్ అవకాశంగా మలచుకున్నారు. ప్రతీ ఛాలెంజ్‌ను సవాల్ గా తీసుకున్నారు. ఓడిన చోటే గెలిచారు. లోకేష్ భవిష్యత్ ఏంటనే చర్చ వేళ..లోకేష్ టీడీపీ భవిష్యత్‌గా కనిపిస్తున్నారు. ఇప్పుడు నెంబర్ టూగా నిలుస్తున్నారు.
సవాళ్లను ఎదుర్కొని
2014 ఎన్నికల్లో గెలుపు తరువాతనే నారా లోకేష్ టీడీపీలో క్రియాశీలకంగా మారారు. చంద్రబాబు తన వారుసుడిని వెనుక ఉండి నడిపించాలని నిర్ణయించారు. హెరిటేజ్ సంస్థల నిర్వహణ చూస్తూ.. పార్టీలో తెర వెనుక పాత్ర పోషించిన నారా లోకేష్ ను చంద్రబాబు తన మంత్రివర్గంలో మంత్రిగా చేసారు. కీలకమైన ఐటీ, మున్సిపల్ శాఖలను అప్పగించారు. పార్టీలోనూ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. పోలిట్ బ్యూరో సభ్యుడు అయ్యారు. 2019 వరకు మంత్రిగా తనకు వచ్చిన అవకాశం లోకేష్ సద్వినియోగం చేసుకొనే ప్రయత్నం చేసారు. నాడు ఎమ్మెల్సీగా మంత్రి అయ్యారు. దొడ్డి దారిన లోకేష్ ను మంత్రి చేసారనే విమర్శలు చంద్రబాబు ఎదుర్కొన్నారు. 2019లో లోకేష్ మంగళగిరి నుంచి పోటీ చేసి ఓడిపోయారు. పార్టీ ఆ ఎన్నికల్లో అధికారం కోల్పోయింది.

సంక్షోభ సమయాల్లో
2019 ఫలితాల తరువాత 23 సీట్లకే పరిమితమైన టీడీపీ రాజకీయంగా వరుస సంక్షోభాలు ఎదుర్కొంది. అధికార వైసీపీ నుంచి రాజకీయంగా క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోవాల్సి వచ్చింది. కేంద్రంలోని ఎన్డీఏతోనూ రాజకీయ వైరం పెరిగింది. ఇదే సమయంలో లోకేష్ రాజకీయ భవిష్యత్ పైన సందేహాలు మొదలయ్యాయి. అధికార పార్టీ నేతలు లోకేష్ సమర్ధతను అవహేళన చేసారు. లోకేష్ తాను 2024 ఎన్నికల్లో మంగళగిరి నుంచే గెలిచి తన తండ్రికి గిఫ్ఠ్ గా ఇస్తానని మాట ఇచ్చారు. ఈ ఎన్నికల్లో అదే చేసారు. యువగళం ద్వారా పార్టీ - ప్రజలకు దగ్గరయ్యేందుకు ప్రయత్నించారు. లోకేష్ యాత్ర చేయలేరనే విమర్శలకు..యాత్రలో అన్ని వర్గాలకు దగ్గరయ్యేలా వ్యవహరించారు. ఆ సమయంలోనే లోకేష్ లో నాయకత్వ లక్షణాలు మెరుగయ్యాయి.

చంద్రబాబు అరెస్ట్ సమయంలో కీలకంగా వ్యవహరించారు. ఢిల్లీ టు అమరావతి ఎప్పుడు ఎలాంటి అడుగులు వేయాలో...ఎక్కడ తగ్గాలో అక్కడ తగ్గుతూ పార్టీని నెగ్గించేందుకు ముందుకు నడిపించారు. మంగళగిరిలో ప్రతీ ఇంటికి దగ్గరయ్యారు. పార్టీ కేడర్ పైన కేసుల సమయంలో అండగా నిలిచారు. రెడ్ బుక్ పేరుతో తమను వేధించిన వారిని వదిలేది లేదంటూ కేడర్ లో భరోసా పెంచారు. చంద్రబాబు, పవన్ ఎన్నికల ప్రచారంలో ఉండగా.. లోకేష్ పూర్తిగా ఎన్నికల రాజకీయం..క్షేత్ర స్థాయి ఎలక్షనీరింగ్ పర్యవేక్షించారు. మంగళగిరిలో తాను గెలవటంతో పాటుగా పార్టీ అనూహ్య విజయంలో కీలకమయ్యారు. అధికారం లోకి వచ్చిన తరువాత లో ప్రొఫైల్ గా ఉంటూ ప్రజాదర్బార్ ద్వారా సామాన్యులకు దగ్గరవుతున్నారు. పార్టీ - ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరిస్తూ..తన సత్తా ఏంటో చాటుతూ..నాయకుడిగా నిలుస్తున్నారు.












Click it and Unblock the Notifications