విజయవాడ టీడీపీ రాజకీయాల్లో కీలక పరిణామం..!!
ఏపీ ఎన్నికల రాజకీయం ఆసక్తి కరంగా మారుతోంది. కొత్త పరిణామాలు తెర మీదకు వస్తున్నాయి. గెలుపు పైన పార్టీలు అంచనాలకు మించిన వ్యూహాలతో సిద్దమవుతున్నాయి. వైసీపీలో ఇంఛార్జ్ ల మార్పు వ్యవహారం సంచలనంగా మారుతోంది. టీడీపీ కంచుకోటల పైన జగన్ ఫోకస్ చేసారు. ఇటు టీడీపీ, జనసేన ఈ ఎన్నికల్లో జగన్ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నాయి. ఇదే సమయంలో విజయవాడ కేంద్రంగా టీడీపీ రాజకీయంలో కీలక అంశాలు చోటు చేసుకుంటున్నాయి.
ఎన్నికల వ్యూహాలు : ఉమ్మడి కృష్ణా జిల్లాలో 2019 ఎన్నికల్లో టీడీపీ రెండు స్థానాలు మాత్రమే గెలిచింది. ఈ సారి ఎన్నికల్లో టీడీపీ, జనసేన పొత్తులో పూర్వ వైభవం దిశగా ప్రయత్నాలు చేస్తోంది. ఈ సమయంలో ఎంపీ అభ్యర్దులతో పాటుగా ఎమ్మెల్యేల ఎంపిక పైన ఆచి తూచి అడుగులు వేస్తోంది. నారా లోకేష్ తన పాదయాత్ర సమయంలో జిల్లాలో రాజకీయాల పైన సమీక్ష చేసారు. పాదయాత్ర సమయంలో కీలకంగా పని చేసిన కేశినేని చిన్ని తాజాగా లోకేష్ తో సమావేశమయ్యారు. ఆ సమయంలో ఎన్టీఆర్ జిల్లా పార్లమెంట్ పరిధిలోని నియోజకవర్గాలలో జరుగుతున్న కార్యక్రమాలు, పార్టీ పరిస్థితి గురించి చర్చ జరిగింది. వైసీపీ నుంచి అభ్యర్దుల ఎంపిక..నియోజకవర్గాల్లో ప్రభావం పైన చర్చించినట్లు తెలుస్తోంది.

పొత్తు లెక్కలు : జనసేనతో పొత్తులో భాగంగా క్షేత్ర స్థాయిలో రెండు పార్టీల మధ్య సమన్వయం గురించి లోకేష్ ఆరా తీసినట్లు సమాచారం. ఇదే సమయంలో చిన్ని తన ట్రస్తు ద్వారా పార్లమెంట్ పరిధిలో నిర్వహిస్తున్న సేవా కార్యక్రమాలను లోకేష్ అభినందించారు. మరింతగా పార్టీ - ట్రస్టు ద్వారా కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. విజయవాడ ఎంపీగా కేశినేని చిన్ని పేరు పరిశీలనలో ఉందనే ప్రచారం వేళ ఈ భేటీలో మరింత స్పష్టత వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. వచ్చే ఎన్నికల్లో సీటు పైన చిన్నికి లోకేష్ సంకేతాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. విజయవాడలో పార్టీలోని పరిస్థితులు..గెలుపే లక్ష్యంగా అమలు చేయాల్సిన కార్యక్రమాల పైన ఇద్దరి మధ్య చర్చ జరిగింది.
ప్రజల్లోనే ఉండండి : వైసీపీలో సీనియర్లకే ప్రాధాన్యత లేవకపోవటంతో కేడర్ నిరుత్సాహంతో ఉందని..ప్రజల్లోనూ పాలన పైన వ్యతిరేకత కనిపిస్తుందని చిన్ని వివరించారు. పార్లమెంట్ పరిధిలో పార్టీ నేతల సమన్వయం పైనా ఈ ఇద్దరి భేటీలో చర్చ జరిగినట్లు తెలుస్తోంది. ఎన్నికల ప్రచారం వరకు వేచి చూడకుండా..ప్రజల్లోనే ఉండాలని లోకేష్ ఈ సందర్భంగా చిన్నికి వివరించినట్లు సమాచారం. చంద్రబాబు జిల్లాల పర్యటన ప్రారంభం అవుతున్న వేళ..విజయవాడ లోనూ నేతలతో సమావేశం ఉంటుందని చెప్పుకొచ్చారు. పార్టీ నేతలతో పాటుగా జనసేన నేతలను సమన్వయం చేసుకుంటూ ముందుకు వెళ్లాలని లోకేష్ సూచించారు. దీంతో, టీడీపీలో సీట్ల పైన అధినాయకత్వం ఒక స్పష్టతకు వచ్చినట్లు కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications