టీ నేతలకు లోకేష్ పాఠాలు: హైదరాబాద్‌పై ఎర్రబెల్లి
హైదరాబాద్: అందరూ అనుకున్నట్లుగానే తెలంగాణ ప్రాంత తెలుగుదేశం పార్టీకి ఆ పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ నేతృత్వం వహించే సూచనలు కనిపిస్తున్నాయి. పార్టీ తెలంగాణ ప్రాంత నాయకులకు ఏర్పాటైన రెండో రోజు మంగళవారం మేధోమథన సదస్సును ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్‌లో నారా లోకేష్ ప్రారంభించారు.
పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌తో లోకేష్ సదస్సును ప్రారంభించారు. తెలంగాణ జిల్లాల్లో పోలింగ్ బూత్‌లవారీగా తీసుకోవాల్సిన చర్యలపై ఆయన పలు సూచనలు చేశారు. కుప్పం నియోజకవర్గంలో వివిధ సంఘాలతో పాటు ప్రతి ఓటుకూ లెక్క పక్కాగా ఉండేలా చేపట్టిన చర్యలపై ఆయన తెలంగాణ నాయకులకు వివరించారు. చంద్రబాబు నాయుడు సీమాంధ్ర, తెలంగాణ నాయకులకు విడివిడిగా మేధో మథన సదస్సులు ఏర్పాటు చేశారు.

రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు పార్టీ ఒంటెత్తు పోకడలు పోతోందని తెలుగుదేశం పార్టీ తెలంగాణ ఫోరం కన్వీనర్ ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు. కేంద్ర పాలిత ప్రాంతమని, హైదరాబాద్ ఆదాయమని కిరికిరి పెడితే సహించబోమని ఆయన మంగళవారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
రెండు ప్రాంతాల జెఎసిలను పిలిచి మాట్లాడాలని తాము డిమాండ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. భద్రాచలంపై ఆంధ్ర ప్రాంతానికి ఏ విధమైన అధికారం లేదని అన్నారు. తెలంగాణ ప్రాంతంలో ఉన్నవాటిని కోరడం సమంజసం కాదని, భద్రాచలంలో ఉన్న రామాలయం మొదటి నుంచీ తెంలగాణ ప్రాంతానిదే అని ఆయన అన్నారు.
తెలంగాణ ప్రక్రియను ఆపాలని తాము ఎప్పుడూ చెప్పలేదని, సీమాంధ్రలో వచ్చిన ఉద్యమాన్ని చల్లార్చాలని మాత్రమే తాము డిమాండ్ చేస్తున్నామని ఎర్రబెల్లి దయాకర్ రావు అన్నారు.












Click it and Unblock the Notifications