చేసిన తప్పు ఒప్పుకున్న నారా లోకేష్?
ఏడాదిన్నర సమయం ఉన్నప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో రాజకీయ వాతావరణం వేడెక్కింది. ప్రధాన పార్టీలైన వైసీపీ, టీడీపీ, జనసేన నాయకులు ఎప్పుడూ ప్రజల్లో ఉండేలా ప్రణాళికలు రచించుకుంటున్నారు. ఈ క్రమంలో తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అమరావతి పరిధిలోని ఉండవల్లిలో పర్యటించారు. ఈ పర్యటన సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. ఆయన ప్రజలను క్షమించాలని కోరారు. అక్కడున్న ప్రజలు కొంత భావోద్వేగానికి గురయ్యారు. సోషల్ మీడియాలో ఈ వార్త వైరల్ గా మారింది.
తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం ఉన్న సమయంలో సీతానగరం ఘాట్ దగ్గర ఉన్న నివాసాలను తొలగించారు. వారికి ఉండవల్లి దగ్గర స్థలాలు ఇచ్చారు. స్థలాలు ఇచ్చే సమయంలో అన్ని సదుపాయాలు ఏర్పాటుచేసిస్తామని హామీ ఇచ్చారు. కానీ ఆ సమయంలో హామీని నిలబెట్టుకోలేకపోయారు. తాజాగా వారంతా నివసిస్తున్న ప్రాంతానికి వెళ్లారు. అక్కడి పరిస్థితి చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ''తమ ప్రభుత్వ హయాంలోనే నీరు, విద్యుత్తు లాంటి సదుపాయాలు ఇచ్చి ఉంటే ఈరోజున మీకు ఈ పరిస్థితి వచ్చేది కాదని, అందుకు కారణం తెలుగుదేశం ప్రభుత్వమేనని, చేతులు జోడించి అడుగుతున్నా మమ్మల్ని క్షమించండి'' అంటూ వ్యాఖ్యానించారు. ఈసారి రాబోయేది టీడీపీ ప్రభుత్వమేనని, రాగానే మీకు అన్ని సదుపాయాలు కల్పిస్తామని, ధైర్యంగా ఉండాలని కోరారు. దీంతో లోకేష్ చేసిన తప్పును ఒప్పుకున్నట్లైందని, రాజకీయాల్లో తప్పులను ఒప్పుకోవడమనేది అరుదుగా జరుగుతుందంటూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు.

వచ్చే ఎన్నికల్లో మంగళగిరి నియోజకవర్గం నుంచి పోటీచేయడానికి లోకేష్ అన్ని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వీలు చిక్కినప్పుడల్లా నియోజకవర్గ పరిధిలోని ప్రతి గ్రామంలోను పర్యటిస్తున్నారు. ఎన్నికల సమయానికి నియోజకవర్గ పరిధిలోని అన్ని గ్రామాలను చుట్టి రావాలనే లోకేష్ ప్రణాళిక. ఈసారి కచ్చితంగా తాను విజయం సాధిస్తాననే ధీమాను వ్యక్తపరిచారు.












Click it and Unblock the Notifications