బాబు ఇలాచేస్తే అసలు విషయాలు చెప్తామని జీవీఎల్: హోదాకు అది అవసరమా అని లోకేష్
అమరావతి: బీజేపీ రాజ్యసభ సభ్యులు జీవీఎల్ నర్సింహా రావు వ్యాఖ్యలకు మంత్రి నారా లోకేష్ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్‌లో కౌంటర్ ఇచ్చారు. ఏపీ సమర్పించిన యూసీలు సరిగా లేవని చెప్పడానికి జీవీఎల్ ఎవరు అని ప్రశ్నించారు. తాము ఇచ్చిన యూసీలు సరిగా లేకుంటే ఆయా శాఖలు వివరణ అడుగుతాయని చెప్పారు.
Recommended Video

నవ్యాంధ్ర రాజధాని అమరావతిలో డ్రైనేజీ పనులకు ఏ విధమైన నిధులు ఇవ్వలేదని చెప్పారు. విజయవాడ, గుంటూరుకు రూ.460 కోట్లు, రూ.540 కోట్లు ఇచ్చారని చెప్పారు. ఇప్పటి వరకు అమరావతికి ఇచ్చింది రూ.1500 కోట్లు మాత్రమేనని చెప్పారు. ఎడ్యుకేషన్ సెస్ లెక్కల్లో అవకతవకలపై కాగ్ ప్రశ్నించిందన్నారు.
హోదాకు యూసీలు అవసరం లేదు
కాగ్ ప్రశ్నలకు బీజేపీ, కేంద్రం సమాధానం చెప్పాలని నిలదీశారు. యూసీలు సమర్పించడం పరిపాలనలో రొటీన్ ప్రాసెస్ అన్నారు. దీనిని పట్టుకొని నిధుల దుర్వినియోగం అంటూ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి యూసీలు అవసరం లేదని జీవీఎల్ గుర్తుంచుకోవాలన్నారు. బ్యాక్‌వర్డ్ జిల్లాల్లో రూ.1000 కోట్ల ఖర్చుకు సంబంధించి యూసీలు ఇచ్చామని, అవి అప్రూవ్ అయ్యాయని చెప్పారు.
ఆ వివరాలు ఇవ్వండి
అమరావతి డ్రైనేజీ పనులకు నిధులు ఇవ్వలేదని లోకేష్ తెలిపారు. రూ.349 కోట్లకు యూసీలు సమర్పించామన్నారు. విజయవాడ, గుంటూరులకు రూ.460, రూ.540 కోట్లు ఇచ్చారని చెప్పారు. రెండు నగరాల్లో ఉన్న పెండింగ్ వర్క్ ఈ ఏడాది లోపు పూర్తి చేస్తామని చెప్పారు. ఇప్పటి వరకు అమరావతికి రూ.1500 కోట్లు ఇచ్చారని, రూ.1583 కోట్లకు యూసీలు సమర్పించామని చెప్పారు. జీవీఎల్ చెబుతున్నట్లుగా పెద్ద మొత్తంలో నిధులు ఎక్కడిచ్చారో లేదా ఎక్కడ ఆమోదించారో వివరాలు ఇవ్వాలన్నారు.
కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియా
13 కేసులలో ఏ1 నిందితుడిగా ఉన్న నేత, షరతులతో కూడిన బెయిల్ పైన ఉన్న నేత జగన్ నేరాల గురించి నీతులు చెబుతారా అని లోకేష్ ప్రశ్నించారు. కిడ్నాపర్లు, బెట్టింగ్ రాయుళ్లు, ఎర్రచందనం స్మగ్లర్లు, భూకబ్జాదారులు, అత్యాచారాలకు పాల్పడే వ్యక్తులు ఉన్న పార్టీకి అధినేతగా ఉన్న జగన్ రాష్ట్రంలో నేరాల గురించి మాట్లాడటం విడ్డూరంగా ఉందన్నారు. కరప్షన్ కింగ్ ఆఫ్ ఇండియాగా అంటూ జగన్‌ను అభివర్ణించారు. వైయస్ హయాంలో క్రైమ్ రేట్ శాతం ఎక్కువగా ఉందని, దీనిని చంద్రబాబు తగ్గించారని లోకేష్ మరో ట్వీట్లో పేర్కొన్నారు.

బాబు వాస్తవాలు వక్రీకరిస్తే 24 గంటల్లో అసలు విషయాలు బయటపెడతాం
కాగా, సోమవారం జీవీఎల్ నర్సింహా రావు టీడీపీ ప్రభుత్వంపై నిప్పులు చెరిగిన విషంయ తెలిసిందే. చంద్రబాబు వాస్తవాలను వక్రీకరిస్తే 24 గంటల్లో అసలు విషయాలు బయటపెడతామని హెచ్చరించారు. దీని పర్యావసనాలు సీఎం ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి కేంద్రం రూ.3000 కోట్లు ఇచ్చినట్లు చంద్రబాబు చెప్పడం హాస్యాస్పదమన్నారు. కేంద్రం వాటా కింద రూ.300 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. దోలేరా ప్రాజెక్టుకు కేంద్రం కేవలం రూ.1293 కోట్లు మాత్రమే ఇచ్చిందన్నారు. రాష్ట్ర ప్రణాళికా సంఘం అధ్యక్షులు కుటుంబ రావు వాస్తవాలు కప్పిపుచ్చుతున్నారన్నారు. ఇండియన్ కరప్షన్ స్టడీస్ అధ్యయనంలో తెలుగు రాష్ట్రాలు మొదటి మూడు స్థానాల్లో ఉన్నాయన్నారు. చంద్రబాబు విభజన రాజకీయాలు చేస్తున్నారన్నారు. కేంద్రంపై అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.












Click it and Unblock the Notifications