జగన్ జిల్లాపై నారా లోకేష్ గురి: రామసుబ్బారెడ్డిని ఒప్పించడమెలా?
కడప: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డికి చెందిన కడప జిల్లాపై తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ గురి పెట్టినట్లు కనిపిస్తున్నారు. కడప జిల్లాలో జగన్మోహన్ రెడ్డిని బలహీనపరచాలనేది ఆయన వ్యూహంగా కనిపిస్తోంది. ఇందులో భాగంగానే ఆయన కడప జిల్లాలోని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ నాయకులను సంప్రదిస్తున్నట్లు తెలుస్తోంది.
తన వ్యూహంలో భాగంగానే లోకేష్ జమ్మలమడుగు శాసనసభ్యుడు ఆదినారాయణ రెడ్డిని తెర మీదికి తెచ్చినట్లు భావిస్తున్నారు. అయితే, జమ్మలమడుగు టిడిపి ఇంచార్జీ రామసుబ్బారెడ్డి ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకోవాలనే ఆలోచనను తీవ్రంగా వ్యతరికేస్తున్నారు. ఇదే విషయంపై ఆయన పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడిని, నారా లోకేష్‌ను, బాలకృష్ణను కలిశారు.
వైయస్సార్ కాంగ్రెసు పార్టీ ఎమ్మెల్యేలలో కీలకంగా ఉన్న ఆదినారాయణ రెడ్డిని పార్టీలో చేర్చుకుంటే జగన్ సొంత జిల్లాలో జరిగే ఈ పరిణామం రాష్ట్రవ్యాప్తంగా కూడా ప్రభావానికి దారి తీస్తుందని, అలాగే జిల్లాలో వైసీపీ ఎమ్మెల్యేలను ఎదుర్కొనేందుకు ఉపయోగపడుతుందని పార్టీలో లోకేష్ కోటరీ భావిస్తోంది. జగన్‌మోహన్‌రెడ్డిని జిల్లాలోనే కట్టడి చేసే ప్రయత్నం చేస్తే రాష్ట్రవ్యాప్తంగా కూడా వైయస్సార్ కాంగ్రెసు పార్టీకి నష్టం జరిగే అవకాశాలు వుంటాయనే అభిప్రాయంతో లోకేష్ ఉన్నారు.

ఆదినారాయణ రెడ్డి పార్టీలో చేరితే వైసిపికి మరో ఎమ్మెల్యే బలం తగ్గడ-ంతో పాటు పాటు ఓ కీలకమైన నాయకుణ్ని పార్టీలోకి తీసుకువచ్చినట్లవుతుందనే ఆలోచన లోకేష్ చేస్తున్నట్లు చెబుతున్నారు. ఏడాది తరువాత స్థానిక సంస్థల శాసనమండలి ఎన్నిక జరగనుంది. ప్రస్తుతం ఆదినారాయణ రెడ్డి సోదరుడు నారాయణరెడ్డి ఎమ్మెల్సీగా కొనసాగుతున్నారు.
ఆయన పదవీ కాలం పూర్తయితే ఆ ఎమ్మెల్సీ పదవిని టీడీపీలో జమ చేసుకునేందుకు ఇప్పటి నుంచే పలు ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఆదినారాయణరెడ్డి పార్టీలోకి వస్తే ఇలాంటి అవకాశాలు సొంతం చేసుకోవడానికి వీలుంటుందన్న చర్చలు కూడా జరుగుతున్నాయి. ఇప్పటికే ఆదినారాయణ రెడ్డి, ఆయన సోదరుడు నారాయణ రెడ్డి జగన్‌కు దూరమయ్యారు. ఇటీవల జగన్ చేపట్టిన నిరవధిక నిరాహార దీక్షకు వారిద్దరు దూరంగానే ఉన్నారు.
ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రయోజనం పొందడమే కాకుండా జిల్లా పరిషత్ పీఠంపై ప్రస్తుతం ఆదినారాయణరెడ్డికి అనుచరుడిగా వున్న వైసీపీ జడ్పీటీసీ సభ్యుడే చైర్మన్‌గా వున్నారు. జిల్లా పరిషత్‌లో కూడా తమ పట్టు కలిగివుండేందుకు ఇప్పటికే టీడీపీ నేతలు పలు ప్రయత్నాలు చేస్తూ వచ్చారు. జిల్లా పరిషత్ పీఠం ఏదో రకంగా తమ ఆధీనంలోకి తీసుకువచ్చే ప్రయత్నం కూడా జరుగుతున్న తరుణంలో లోకేష్‌తోపాటు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా ఈ వ్యవహారంపై దృష్టిపెట్టినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications