లోకేష్ ఫ్యాక్టర్: బాబు క్యాబినెట్లో సీనియర్లు ఔట్
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి మంత్రివర్గంలో సీనియర్లకు బెర్తులు లభించకపోవడం చర్చనీయాంశంగా మారింది. పలువురు సీనియర్లను పక్కన పెట్టి కొంత మంది జూనియర్లను చంద్రబాబు తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. తన తనయుడు నారా లోకేష్‌ను భవిష్యత్తు నాయకుడిగా నిలబెట్టడానికి ఆయన అలా చేసినట్లు భావిస్తున్నారు. మంత్రివర్గ కూర్పులో నారా లోకేష్ కీలక పాత్ర పోషించినట్లు చెబుతున్నారు.
స్థానిక పరిస్థితులు, సామాజిక వర్గాలు కూడా ఆటంకంగా మారినట్లు చెబుతున్నారు. అయితే, 2019 ఎన్నికల్లో నారా లోకేష్‌ను ముఖ్యమంత్రి అభ్యర్థిగా ముందుకు తేవడానికి అనుకూలంగానే మంత్రివర్గ కూర్పు జరిగిందనే మాట వినిపిస్తోంది. మంత్రివర్గ కూర్పులో పార్లమెంటు సభ్యులు సుజనా చౌదరి, సిఎం రమేష్ పాలు పంచుకున్నట్లు చెబుతున్నారు. ఈ నలుగురు కలిసే మంత్రివర్గంలోకి తీసుకోవాల్సినవారిని జాబితాను రూపొందిచినట్లు చెబుతున్నారు.

చంద్రబాబు మంత్రివర్గంలో చోటు దక్కని సీనియర్లలో మాజీ మంత్రులు డాక్టర్ కోడెల శివప్రసాదరావు, గోరంట్ల బుచ్చయ్య చౌదరి, కిమిడి కళా వెంకట్రావు, పతివాడ నారాయణస్వామి, సీనియర్ ఎమ్మెల్యే ధూళిపాళ నరేంద్ర తదితరులు ఉన్నారు. గుంటూరు జిల్లాలో కోడెల, ధూళిపాళ్ళకు అవకాశం దక్కకపోవడం ఆ పార్టీ వర్గాల్లో చర్చనీయాంశమైంది. కోడెల పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న సీనియర్ నేత. కానీ, ఆయన ఆ జిల్లాలో అందరినీ కలుపుకొని వెళ్లలేకపోతున్నారన్న అభిప్రాయం రేసులో వెనకబడేలా చేసింది.
ఐదోసారి ఎమ్మెల్యేగా గెలిచిన ధూళిపాళ్ల నరేంద్ర గతంలో కాంగ్రెస్ గాలిలో కూడా గెలిచి సత్తా చాటుకొన్నారు. కానీ, ఆయన ఆ జిల్లాలోని సంగం డైరీకి అధ్యక్షుడిగా ఒక పదవిలో ఉండటం, ఆ డైరీకి సంబంధించి కొన్ని పరిణామాలు ఆయనకు ఇప్పుడు అడ్డంకులు సృష్టించాయి. కమ్మ సామాజిక వర్గానికి ప్రస్తుతానికి మూడు మంత్రి పదవులకు మించి ఇవ్వలేనని చంద్రబాబు అనుకోవడంతో గోరంట్లకు అవకాశం రాలేదు.
శ్రీకాకుళం జిల్లాలోని వర్గ విబేధాలు కళా వెంకట్రావుకు అవకాశాన్ని దూరం చేశాయి. విజయనగరం జిల్లాలో పతివాడ నారాయణస్వామి బాగా సీనియర్ అయినా ఆయనకు వయసు పైబడటంతో అదే సామాజిక వర్గం నుంచి మృణాళినికి అవకాశం ఇచ్చారు. గుంటూరు జిల్లా నుంచి మోదుగుల వేణుగోపాలరెడ్డి పేరు ఆఖరి నిమిషం వరకూ జాబితాలో ఉన్నా చివరి దశలో మారిపోయింది. అనంతపురం జిల్లాలో మారిన సమీకరణాల్లో పల్లెకు బెర్త్ ఖరారు కావడంతో మోదుగులకు ఆగిపోయింది.
సామాజిక వర్గాల సమీకరణ, స్థానిక పరిస్థితుల కారణంగా కొంత మంది సీనియర్లకు బెర్తులు దక్కలేదని చెబుతున్నప్పటికీ నారా లోకేష్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని కసరత్తు జరిగినట్లు భావిస్తున్నారు.












Click it and Unblock the Notifications