Nara Lokesh యువగళం ముగిసింది.. శంఖారావం మొదలైంది!!
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ మరోమారు ప్రజా క్షేత్రంలోకి దిగి ప్రజల మద్దతు కోసం ప్రయత్నం చేయనున్నారు. ఇప్పటికే టీడీపీ అధినేత చంద్రబాబు రా కదలిరా సభలతో ప్రజలలోకి వెళ్తున్నారు. మరోవైపు భువనేశ్వరి కూడా మరోవైపు పరామర్శ యాత్రలను కొనసాగిస్తున్నారు. ఏపీలో ఎన్నికలకు సమయం దగ్గర పడుతున్న తరుణంలో లోకేష్ మరోమారు జనంలోకి వచ్చి టీడీపీకి అండగా ఉండాలని ప్రజలను కోరనున్నారు.
ఇప్పటికే లోకేష్ యువగళం పేరుతో పాదయాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. రాష్ట్ర వ్యాప్తంగా అనేక నియోజకవర్గాలలో లోకేష్ యువగళం పాదయాత్ర నిర్వహించారు. ఇక తాజాగా ఎన్నికల సమరానికి సిద్ధమైనట్టు శంఖారావం పేరుతో సభలు నిర్వహించటానికి లోకేష్ రెడీ అవుతున్నారు. ఈనెల 5వ తేదీ నుండి లోకేష్ ఉత్తరాంధ్ర పర్యటనకు రెడీ అవుతున్నారు.

శంఖారావం పేరుతో ఆయన మూడు జిల్లాలలో సభలు నిర్వహించనున్నారు. టీడీపీకి ప్రజల మద్దతు కూడగట్టి ఎన్నికల్లో టీడీపీని అధికారంలోకి తీసుకురావటమే లక్ష్యంగా లోకేష్ దూకుడుగా ముందుకు వెళ్లనున్నారు. పార్వతీపురం మన్యం, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో లోకేష్ పర్యటించి సభలు కొనసాగించనున్నారు. అయితే గతేడాది లోకేష్ యువ గళం పాదయాత్రని జనవరి 27వ తేదీన ప్రారంభించిన విషయం తెలిసిందే. అప్పుడు లోకేష్ తన పాదయాత్రను అనివార్య కారణాలతో కుదించుకున్నారు.
యువగళం పాదయాత్రలో లోకేష్ అన్ని ప్రాంతాలను కవర్ చెయ్యలేదు. కవర్ చేయని ప్రాంతాలలో ఇప్పుడు లోకేష్ శంఖారావం పేరుతో సభలను నిర్వహించనున్నారు. ఈనెల 5వ తేదీన ఇచ్చాపురం నియోజకవర్గంలో లోకేష్ శంఖారావం సభను ప్రారంభిస్తారు. ఆపై 6వ తేదీన పాలకొండలో సభ నిర్వహిస్తారు. 7వ తేదీన కురుపాం, పార్వతీపురం నియోజకవర్గాలలో లోకేష్ శంఖారావం సభలు పెడతారు.
ఆపైన 8న సాలూరు, బొబ్బిలి, రాజాంలో జరిగే సభల్లో పాల్గొంటారు. 9వ తేదీన చీపురుపల్లి, ఎచ్చెర్ల, నెల్లిమర్లలో సభలు నిర్వహిస్తారు. 10న విజయనగరం జిల్లా గజపతిపురం, శృంగవరపు కోట నియోజకవర్గాలో సభలు నిర్వహిస్తారు.ఇక లోకేష్ శంఖారావానికి ప్రజల మద్దతు ఎలా ఉంటుందో వేచి చూడాలి.












Click it and Unblock the Notifications