67 కాదు, పదహారే: చంద్రబాబుపై లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ అధినేత, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడిపై ఆయన కుమారుడు, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ బుధవారం ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 67ఏళ్ల వయసు వచ్చినా తన తండ్రి 16ఏళ్ల యువకుడేనని ఆయన వ్యాఖ్యానించారు.
చంద్రబాబు 67వ జన్మదినం సందర్భంగా బుధవారం ప్రకాశం జిల్లాలోని ఎర్రగొండపాలెంలో పార్టీ నేతలు మెగా మెడికల్ క్యాంపును ఏర్పాటు చేశారు. క్యాంపును ప్రారంభించిన సందర్భంగా లోకేశ్ మాట్లాడారు.
67ఏళ్ల వయసులోనూ చంద్రబాబు 16ఏళ్ల నవ యువకుడిలా పనిచేస్తూ యువతకు ఆదర్శంగా నిలుస్తున్నారని లోకేశ్ అన్నారు. విభజన అనంతరం రూ.16 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉన్నా... రాష్ట్రాన్ని చంద్రబాబు ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తున్నారని కొనియాడారు.

రాష్ట్ర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని ఓ వైపు సమస్యలను పరిష్కరించుకుంటూనే.. మరోవైపు సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నారని ఆయన అన్నారు. రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని చెప్పారు.
రెండేళ్ల వరకూ ప్రతిపక్షం గురించి మాట్లాడే ప్రసక్తే లేదన్నారు. ఇతర దేశాల్లో ప్రతిపక్షం నామమాత్రంగా ఉంటుందని, ఇటువంటి పరిస్థితి 2019 కల్లా ఏపీలోనూ వస్తుందన్నారు. 18 నెలల్లో వెలుగొండ ప్రాజెక్టును పూర్తి చేసి ఉభయగోదావరి జిల్లాల తరహాలో ప్రకాశం జిల్లాను సస్యశ్యామలం చేస్తామని లోకేశ స్పష్టంచేశారు.
వేసవిని దృష్టిలో ఉంచుకొని ప్రతి పంచాయతీలో చలివేంద్రాలుఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సమావేశంలో మంత్రులు రావెల, శిద్ధా రాఘవరావు, పార్టీ జిల్లా అధ్యక్షుడు దామచర్ల జనార్దన్, ఎర్రగొండపాలెం ఎమ్మెల్యే డేవిడ్ రాజు, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications