దొంగబ్బాయిలా పేపర్, చానెల్: జగన్‌పై నారా లోకేష్ ఫైర్
ఒంగోలు/ విశాఖపట్నం: వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ నాయకుడు నారా లోకేష్ తీవ్రంగా మండిపడ్డారు. జగన్ దుష్ప్రచారాన్ని తిప్పికొట్టాలని ఆయన పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. జగన్ అబద్ధాలు చెబుతూ ప్రజలను మభ్య పెడుతున్నారని ఆయన అన్నారు.
ప్రకాశం జిల్లాలోని కందుకూరులో ప్రకాశం ఇంజినీరింగ్ కాలేజిలో కార్యకర్తల శిక్షణా శిబిరాన్ని శుక్రవారం లోకేష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. తెలంగాణ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర రావు, జగన్ కలిసి ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిని అడ్డుకుంటున్నారని ఆయన ఆరోపించారు.
కార్యకర్తలే తమ పార్టీ ప్రచారకర్తలని నారా లోకేష్ అన్నారు. ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. ర్యాగింగ్ నిరోధానికి టీఎన్‌ఎస్‌ఎఫ్ కృషిచేస్తుందని కార్యకర్తల శిక్షణాశిబిరంలో నారా లోకేష్ చెప్పారు. పార్టీ సంక్షేమ నిధి ద్వారా 126 కుటుంబాలను ఆదుకున్నట్లు తెలిపారు. విడతలవారీగా పార్టీ కార్యకర్తలకు ఏడాది పాటు శిక్షణాతరగతులు నిర్వహిస్తామని చెప్పారు ఈ శిక్షణా శిబిరాంలో ప్రకాశం, నెల్లూరు, గుంటూరు జిల్లాల కార్యకర్తలు హాజరయ్యారు.

జగన్ అసమర్థ ప్రతిపక్ష నాయకుడని ఆంధ్రప్రదేశ్ మంత్రి పత్తిపాటి పుల్లారావు విమర్శించారు. మంత్రులు పత్తిపాటి పుల్లారావు, గంటా శ్రీనివాస రావు తదితరులు చంద్రన్న యాత్ర చేపట్టారు. జగన్ అసత్యాలను ఎమ్మెల్యేల ద్వారా ప్రచారం చేస్తున్నారని పత్తిపాటి పుల్లారావు అన్నారు. జగన్ మీడియా ద్వారా విషం చిమ్ముతున్నారని ఆయన విమర్శించారు.
చంద్రబాబు నాయుడి ప్రభుత్వం 54 లక్షల 6 వేల మందికి రుణమాఫీ చేసిందని, ఇంత పెద్ద యెత్తున రుణమాఫీ దేశంలో ఎక్కడా జరగలేదని చెప్పారు.












Click it and Unblock the Notifications