నాడు KIA..నేడు ICEA: ఢిల్లీలో నారా లోకేష్ విందు
Nara Lokesh: ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ ప్రస్తుతం దేశ రాజధానిలో పర్యటిస్తోన్నారు. తీరిక లేని షెడ్యూల్‌ను గడుపుతున్నారు. రాష్ట్రానికి భారీ స్థాయిలో పెట్టుబడులను ఆకర్షించే క్రమంలో పలువురు పారిశ్రామికవేత్తలను కలుసుకుంటోన్నారు. వారితో వరుసగా సమావేశాలను నిర్వహిస్తోన్నారు.
ఈ క్రమంలో- ఇండియన్ సెల్యూలర్ అండ్ ఎలక్ట్రానిక్స్ అసోసియేషన్ (ICEA) ప్రతినిధులతో నారా లోకేష్ భేటీ అయ్యారు. ఐసీఈఏ ఛైర్మన్ పంకజ్ మహీంద్ర అధ్యక్షతన ఈ భేటీ ఏర్పాటైంది. సోమవారం రాత్రి వాళ్లు ఇచ్చిన విందుకు హాజరయ్యారు. రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడానికి గల అవకాశాల గురించి వారికి వివరించారు.

ఈ సందర్భంగా పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇచ్చారు. దేశంలోనే అత్యంత సులభతరమైన పారిశ్రామిక విధానాలను అనుసరిస్తోన్నామని నారా లోకేష్ చెప్పారు. ఎలక్ట్రానిక్స్ సహా అన్ని రకాల పరిశ్రమలకు ఏపీలో అపారమైన అవకాశాలు ఉన్నాయని, వాటిల్లో పెట్టుబడులు పెట్టడానికి అత్యంత అనుకూల వ్యవస్థను ప్రవేశపెట్టామని గుర్తు చేశారు.
ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్‌తో పాటు స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అనే పాలసీని అమలు చేస్తోన్నామని నారా లోకేష్ అన్నారు. పేరు పొందిన పారిశ్రామికవేత్తలతో ప్రత్యేక ఓ టాస్క్‌ఫోర్స్‌ను ఏర్పాటు చేశామని, పెట్టుబడులను రాబట్టుకోవడంలో తలెత్తే విధానపరమైన సమస్యలు, సవాళ్లను అధిగమించడానికి ఎప్పటికప్పుడు చర్యలు తీసుకుంటున్నామని వివరించారు.
రాష్ట్రాన్ని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా తీర్చిదిద్దబోతోన్నామని, దీనితో పాటు ఐటీ, ఇతర మౌలిక సదుపాయాల రంగాల్లో ఇతర రాష్ట్రాలతోనే కాకుండా, దేశాలతోనూ పోటీపడుతున్నామని నారా లోకేష్ వ్యాఖ్యానించారు. ఇందులో భాగంగా తిరుపతిని ఎలక్ట్రానిక్స్ హబ్‌గా మార్చుతామని, దీనికి పారిశ్రామికవేత్తలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు.

వచ్చే అయిదు సంవత్సరాలలో 20 లక్షల ఉద్యోగాలను కల్పించడంలో ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాలదే కీలకపాత్ర అని పేర్కొన్నారు. అనంతపురంలో కియా మోటార్స్‌ను తీసుకొచ్చామని ఆయన గుర్తు చేశారు. అనంతపురం, కర్నూలు జిల్లాలో అటోమొబైల్స్, ఎలక్ట్రానిక్స్ పరిశ్రమ, ఈవీ కేంద్రాలు ఏర్పాటు కానున్నాయని చెప్పారు.
అంతకుముందు కౌశల్ భవన్‌లో కేంద్ర నైపుణ్యాభివృద్ధి శాఖ మంత్రి జయంత్ సింగ్‌తో భేటీ అయ్యారు నారా లోకేష్. ఆ శాఖ కార్యదర్శి అతుల్ కుమార్ తివారీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి కార్పొరేషన్ సీఈవో వేద్ మణి తివారీలు ఇందులో పాల్గొన్నారు. నైపుణ్య గణనపై వారికి ప్రెజెంటేషన్ ఇచ్చారు.
టీడీపీ- జనసేన- బీజేపీ కూటమి ప్రభుత్వం వచ్చే అయిదేళ్లలో లక్షలాది ఉద్యోగాల కల్పను కల్పించడమే ప్రధాన లక్ష్యంగా పని చేస్తోందని, ఇందులో భాగంగా స్కిల్ డెవలప్మెంట్, స్కిల్ సెన్సస్ చేపట్టామని వివరించారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం, నేషనల్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తమవంతు సహకారం అందించాలని విజ్ఞప్తి చేశారు.












Click it and Unblock the Notifications