వెంకన్న సాక్షిగా ప్రమాణం చేసి..వైఎస్ వివేకా మర్డర్ మిస్టరీ వీడిందని లోకేష్ సంచలన వ్యాఖ్యలు
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నికల ప్రచారంలో భాగంగా వైయస్ వివేకానంద రెడ్డి హత్య కేసు పై మాట్లాడిన నారా లోకేష్ వైయస్ వివేకా హత్యతో తమ కుటుంబానికి, తనకు ఎలాంటి ప్రమేయం లేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేస్తానని , జగన్ కూడా ప్రమాణం చేయాలని సవాల్ విసిరారు. ఆయన చేసిన సవాల్ కు కట్టుబడి ఈరోజు అలిపిరిలో నారా లోకేష్ తిరుమల వెంకటేశ్వర స్వామి సాక్షిగా ప్రమాణం చేశారు.

వైఎస్ వివేకా హత్యకేసు .. వెంకన్న సాక్షిగా లోకేష్ ప్రమాణం..
వివేకా హత్య లో తనకు గానీ, తన కుటుంబానికి గానీ ఎలాంటి పాత్ర లేదని వెంకన్న సాక్షిగా ప్రమాణం చేశానని సోషల్ మీడియాలో పేర్కొన్న లోకేష్ తన చాలెంజ్ కు భయపడి పులివెందుల పిల్లి పారిపోయిందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాను సవాల్ చేసినా జగన్ రెడ్డి బయటకు రాలేదని, చెల్లికి న్యాయం చేయలేనోడు రాష్ట్రంలో మహిళలకు ఏం న్యాయం చేస్తాడు అంటూ విమర్శలు గుప్పించారు. వివేకా హత్య కేసులో జగన్ రెడ్డి పాత్ర ఉందని అందుకే రాలేదని తీవ్ర వ్యాఖ్యలు చేశారు నారా లోకేష్.

బాబాయ్ మర్డర్ మిస్టరీ వీడిపోయింది... బాబాయ్ ని వేసేసింది అబ్బాయే
తమకు చిత్తశుద్ధి ఉంది కాబట్టి ఇక్కడకు వచ్చి ప్రమాణం చేశామని పేర్కొన్నారు . ఈరోజు బాబాయ్ మర్డర్ మిస్టరీ వీడిపోయింది. బాబాయ్ ని వేసేసింది అబ్బాయే అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగన్ రెడ్డి తన సొంత కుటుంబ సభ్యులను కూడా చంపారని ఆరోపించిన లోకేష్ ,గరుడ సర్కిల్ దగ్గర తాను ప్రమాణం చేసి, దైవసాక్షిగా ప్రమాణం చేయడానికి జగన్ రెడ్డి ఎందుకు భయపడుతున్నారో అందరికీ తెలుసన్నారు.జగన్ కు టైం ఇచ్చిన లోకేష్ దాదాపు గంట సేపు ఎదురు చూసి చివరకు తానే ప్రమాణం చేశారు .

లోకేష్ వెంట అలిపిరిలో భారీగా టీడీపీ నేతలు .. ప్రమాణం చేసిన లోకేష్
ఎన్నికల ముందు జరిగిన వివేకానంద రెడ్డి హత్య కేసులో అప్పుడు నేరం అంతా టీడీపీ పైనే రుద్ది , సిబిఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేసి, ఇప్పుడు సిబీఐ కి జగన్ ఎందుకు సహకరించడం లేదో చెప్పాలని పేర్కొన్న లోకేష్ జగన్ను టార్గెట్ చేశారు. లోకేష్ వెంట టిడిపి నేతలు, పెద్ద ఎత్తున కార్యకర్తలు అలిపిరికి చేరుకున్నారు. ఇక అందరి ముందు లోకేష్ వివేకా హత్యతో తమకు సంబంధం లేదని ప్రమాణం చేశారు. తాను అన్నమాట ప్రకారం ప్రమాణం చేశారు.












Click it and Unblock the Notifications