సాగనిస్తే పాదయాత్ర.. అడ్డుకుంటే దండయాత్ర: జగన్ సర్కార్ పై ఘాటుగా లోకేష్
టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ నిర్వహిస్తున్న యువ గళం పాదయాత్ర ప్రస్తుతం కర్నూలు జిల్లాలో కొనసాగుతోంది. నేడు పాదయాత్రలో భాగంగా ఆధ్యాత్మిక కేంద్రమైన మంత్రాలయంలో లోకేష్ పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడిన లోకేష్ మంత్రాలయంలో పాదయాత్ర చేయడం తన అదృష్టంగా భావిస్తున్నట్లు పేర్కొన్నారు. ఇదే సమయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని అధికార వైసీపీ పై నిప్పులు చెరిగారు.
యువ గళం పాదయాత్రకు వస్తున్న ఆదరణ చూసి సీఎం జగన్ భయపడుతున్నారని, తనను అడ్డుకోవడానికి మొదట పోలీసులను పంపించారని, ఆ మోడల్ వర్కౌట్ కాక పోవడంతో, ప్రస్తుతం వైసీపీ వారిని పంపిస్తున్నారని పేర్కొన్నారు. పద్ధతిగా సాగనిస్తే పాదయాత్ర.. లేదంటే దండయాత్ర అంటూ లోకేష్ తేల్చిచెప్పారు. వివేకా హత్య కేసు దారి మళ్లించడానికి సీఎం జగన్ శతవిధాలా ప్రయత్నం చేస్తున్నారన్నారు.

బాబాయ్ హత్య కేసులో కుటుంబం మొత్తం బుక్ అయిపోయిందని లోకేష్ వ్యాఖ్యలు చేశారు. ఒక బాబాయిని లేపేసి మరో బాబాయ్ జైలుకు వెళ్లాడని పేర్కొన్న లోకేష్ త్వరలో అబ్బాయిలు కూడా జైలుకు పోవడం ఖాయం అంటూ చేశారు. రావాలి జగన్ కావాలి జగన్ అంటూ చంచల్ గూడ జైలు పిలుస్తోంది అని, తర్వాత జైలుకెళ్ళేది ఎవరు అనే విషయంపై బెట్టింగ్ లు కూడా నడుస్తున్నాయని లోకేష్ ఘాటు వ్యాఖ్యలు చేశారు.
అకాల వర్షాలతో రైతులు పంటలు నష్టపోతే కనీసం సమీక్ష చేసే తీరిక కూడా ముఖ్యమంత్రికి లేకుండాపోయిందని లోకేష్ మండిపడ్డారు. ధాన్యం కొనుగోలు చేయడానికి ఒక విధానాన్ని కూడా ప్రకటించలేని దౌర్భాగ్య ప్రభుత్వం ఏపీలో ఉందన్నారు. యువతకు ఇచ్చిన హామీలను నెరవేర్చలేదని, జాబ్ క్యాలెండర్ ఇవ్వలేదని, యువత ఎప్పుడూ పేదరికంలో మగ్గుతూ ఉండాలని జగన్ కోరుకుంటున్నారని లోకేష్ పేర్కొన్నారు.
100 సంక్షేమ కార్యక్రమాలు రద్దు చేసిన మొదటి సీఎం జగన్మోహన్ రెడ్డి అని అసహనం వ్యక్తం చేశారు లోకేష్. టిడిపి అధికారంలోకి వచ్చిన వెంటనే తొలి ఏడాదిలోనే ఉద్యోగ నోటిఫికేషన్లు జారీ చేసి, ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీ ఇచ్చారు నారా లోకేష్.












Click it and Unblock the Notifications