నారా లోకేశ్ సొంత టీమ్ యాక్టివ్: చివరికి ఆయన కూడా సైడ్
Nara Lokesh: రెండో ఏడాదికే..ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ సారథ్యంలో రాష్ట్రంలో అధికారలో ఉన్న తెలుగుదేశం- జనసేన- భారతీయ జనతా పార్టీ సంకీర్ణ కూటమిలో ఇబ్బందికర పరిస్థితులు తలెత్తినట్లు కనిపిస్తోన్నాయి. సర్దుబాటు గొడవలు ఇప్పుడిప్పుడే బీజం వేసుకుంటోందనే అంచనాలు ఉన్నాయి.
రెండు నెలల కిందట తొలి వార్షికోత్సవాన్ని జరుపుకొంది టీడీపీ కూటమి ప్రభుత్వం. తొలి ఏడాదిని విజయవంతంగా పూర్తి చేసుకుంది. గత ఏడాది జూన్ 12వ తేదీన రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన విషయం తెలిసిందే. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ సమక్షంలో చంద్రబాబు, పవన్ కల్యాణ్.. ఇతర మంత్రులు ప్రమాణం స్వీకారం చేశారు.

రోజులు గడుస్తున్న కొద్దీ కూటమిలో లుకలుకలు నెలకొంటోన్నాయనే అభిప్రాయాలు వ్యక్తమౌతోన్నాయి. జనసేన శాసన సభ్యులు ప్రాతినిథ్యాన్ని వహిస్తోన్న నియోజకవర్గాలతో పాటు, ఆ పార్టీ బలంగా ఉన్న చోట్ల తెలుగుదేశం పార్టీ పెత్తనం, ఆధిపత్య ధోరణి అధికమౌతూ వస్తోందని చెబుతున్నారు.
ఈ పరిణామాల మధ్య తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి, మంత్రి నారా లోకేష్.. సొంతంగా తనకంటూ ఓ ఇమేజ్, బ్రాండ్ ను సృష్టించుకుంటోన్నారని, ఈ క్రమంలో పవన్ కల్యాణ్ ను పక్కన పెట్టాలనే ఆలోచనలో ఉన్నారనే ప్రచారం ఊపందుకుంటోంది.
దీనికి మరింత బలాన్ని చేకూర్చేలా.. రైజ్ సర్వే సంస్థ చీఫ్ ప్రవీణ్ పుల్లట ఓ ట్వీట్ చేశారు. 2029 అసెంబ్లీ ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీ తరఫున ముఖ్యమంత్రి అభ్యర్థిగా ఎదగాలని నారా లోకేష్ ప్రయత్నాలు సాగిస్తోన్నారని, దీనికోసం తన సొంత టీమ్ ను రంగంలోకి దించారనేది దీని సారాంశం.
ఈ క్రమంలో నారా లోకేష్ ఇప్పటికే సొంత టీమ్ ను ఏర్పాటు చేసుకున్నారని, పలు మంత్రిత్వ శాఖలను కూడా పర్యవేక్షిస్తోన్నారని ప్రవీణ్ పుల్లట వెల్లడించారు. ఫలితంగా వచ్చే రెండు సంవత్సరాలు.. ఏపీ రాజకీయాలకు అత్యంత కీలకంగా మారబోతోన్నాయని పేర్కొన్నారు. రానున్న రెండేళ్లలో ఏపీ రాజకీయాల్లో పెను మార్పులు సంభవిస్తాయని అంచనావేశారు.
అదే నిజమైతే.. దీనికి టీడీపీ కూటమి భాగస్వామ్య పార్టీ జనసేన ఎలా స్పందిస్తుందనేది చర్చనీయాంశమైంది. ముఖ్యమంత్రి అభ్యర్థిగా నారా లోకేష్ ప్రొజెక్ట్ కావడం అంటే.. దాదాపుగా పవన్ కల్యాణ్ ను సైడ్ చేసినట్టే అవుతుందనేదనడంలో సందేహాలు అక్కర్లేదు. దీనికి పవన్ కల్యాణ్ గానీ, జనసేన నాయకులు, కార్యకర్తలు అంగీకరిస్తారా? అనేది ఆసక్తికరం.
2029 టీడీపీ సీఎం అభ్యర్థిగా నారా లోకేశ్!
— Praveen Pullata (@praveenpullata) August 8, 2025
ఇప్పటికే సొంత టీమ్ ఏర్పాటు, పలు మంత్రిత్వ శాఖల పర్యవేక్షణ..
రానున్న రెండేళ్లలో ఏపీ రాజకీయాల్లో
పెను మార్పులు.. ( సశేషం )
మరో 15 సంవత్సరాలు టీడీపీ కూటమి అధికారంలో ఉండాలని కోరుకుంటోన్నట్లు పవన్ కల్యాణ్ పలు సందర్భాల్లో బాహటంగానే వెల్లడించిన విషయం తెలిసిందే. ఆయన వ్యాఖ్యలు వ్యాఖ్యలు టీడీపీ కూటమికి మాత్రమే పరిమితమా? లేక ముఖ్యమంత్రి అభ్యర్థికి కూడా వర్తిస్తాయా? అనే విషయంపై చర్చ జరుగుతోంది.












Click it and Unblock the Notifications