నాన్నపై 37 కేసులు పెట్టారు: నారా లోకేష్ వ్యాఖ్య
హైదరాబాద్: పదేళ్ల కాంగ్రెసు పాలనలో తన తండ్రిపై 37 కేసులు పెట్టారని, ఒక్కటి కూడా నిరూపించలేక పోయారని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం విద్యార్థి సంఘాల సమాఖ్య (టిఎన్ఎస్ఎఫ్) శిక్షణా తరగతులను ఆయన బుధవారం ప్రారంభించి, ప్రసంగించారు.
రాజకీయ నాయకుల అవినీతి కారణంగానే ధరలు పెరిగాయని ఆయన విమర్శించారు. 2004 తర్వాత ఫ్యాబ్ సిటీలో ఒక్కరికైనా ఉద్యోగం వచ్చిందా ఆయన అడిగారు. ఆదాయం పెరిగిన స్థాయిలో ఉద్యోగాలు ఎందుకు పెరగలేదని ఆయన ప్రశ్నించారు.

అవినీతి క్యాన్సర్ వంటిదని, యువతకూ ప్రజలకూ నష్టం చేస్తుందని ఆయన అన్నారు. రాష్ట్రంలో పరిశ్రమలు పెట్టాలంటే ప్రతి ఒక్కరూ లంచం అడుగుతున్నారని వ్యాపారులు చెబుతున్నట్లు లోకేష్ తెలిపారు. అవినీతి వల్ల యువత ఉపాధి కోల్పోయి నిరుద్యోగులవుతున్నారని ఆయన చెప్పారు.
చంద్రబాబు నాయుడి తనయుడు నారా లోకేష్ ఇటీవలి కాలంలో రాజకీయాల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. తెలుగుదేశం పార్టీ వైపు యువతను, విద్యార్థులను ఆకర్షించడానికి ప్రయత్నిస్తున్నారు. వారికి ప్రత్యేకంగా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగానే బుధవారం టిఎన్ఎస్ఎఫ్ శిక్షణా తరగతులను ఏర్పాటు చేశారు.












Click it and Unblock the Notifications