అదృష్టం: ఇద్దరు సీఎంలపై గవర్నర్, 'అన్నా' అని కేసీఆర్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు భేటీ పైన గవర్నర్ నరసింహన్ ఆదివారం స్పందించారు. ఇద్దరు ముఖ్యమంత్రుల భేటీ శుభపరిణామమని, రెండు రాష్ట్రాలకు సమర్థులైన ముఖ్యమంత్రులు దొరికారని గవర్నర్ అన్నారు.
ఇది ప్రజల అదృష్టమని చెప్పారు. ఇద్దరు కలిసి పని చేసి రెండు తెలుగు రాష్ట్రాలను దేశానికి మార్గదర్శకంగా తీర్చిదిద్దాలని చెప్పారు. ఆదివారం మధ్యాహ్నం చంద్రబాబు, కేసీఆర్‌లు రాజ్ భవన్లో దాదాపు రెండు గంటల పాటు సమావేశమై పలు సమస్యల పైన చర్చించిన విషయం తెలిసిందే.

ఈ భేటీలో కేసీఆర్ రాజధాని పైన చంద్రబాబుకు సలహా ఇచ్చిన విషయం తెలిసిందే. తమ రాజధాని నిర్మాణం చాలా వ్యయభారం అవుతోందని, కేంద్రం సహకారం కోరుతున్నామని, తెలంగాణ ప్రభుత్వం సహకారం కూడా కావాలని బాబు అన్నారు. దానికి కేసీఆర్ మాట్లాడుతూ.. కేంద్రం నుండి అంత సాయం అందదేమోనని అన్నారు. అదే సమయంలో తాము కేంద్రం వద్దకు రాకున్నా ఏపీ డిమాండ్‌కు మద్దతు తెలుపుతున్నామన్నారు.
ఉత్తరం దిక్కున నది ప్రవహించే రాజధానులు ప్రపంచవ్యాప్తంగా అభివృద్ధి చెందాయని, మీకు ఉత్తరం దిక్కు అమరావతి నుండి మంగళగిరి వరకు నది ఉన్నందున రాజధానిగా విజయవాడ అభివృద్ధి చెందుతుందని కేసీఆర్ సూచించారు. కేసీఆర్ ఏపీ స్పీకర్ కోడెల శివప్రసాద్‌ను పలుమార్లు అన్నా.. అన్నా అంటూ పలకరించగా.. తెలంగాణ స్పీకర్ మధుసూదనాచారితో చంద్రబాబు ముచ్చటించారు.












Click it and Unblock the Notifications