టిటిడి బోర్డులోకి 'టి' నేత అరికెల: గోడ దూకిన ఎమ్మెల్యే, వీరూ నిద్రపోయారు
తిరుపతి: తిరుమల తిరుపతి దేవస్థానం (టిటిడి) బోర్డు సభ్యుడిగా నిజామాబాద్ మాజీ ఎమ్మెల్యే, తెలంగాణల టిడిపి నేత అరికెల నర్సారెడ్డిని నియమించారు. అరికెల నియామకాన్ని ఖరారు చేస్తూ రాష్ట్ర దేవాదాయశాఖ చీఫ్ సెక్రటరీ జేఎస్వీ ప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు.
గతంలో తనకు ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవకాశం ఇవ్వకుండా వేం నరేందర్ రెడ్డికి అవకాశం ఇచ్చారని ఆరోపిస్తూ, ఆయన అలక వహించారు. నేతలందరూ పార్టీని వీడినా తాను తెరాసపై ఒంటరి పోరాటం చేస్తున్నానని అరికెల నాడు వాపోయారు.
తన పోరాటాన్ని గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై స్పందించిన చంద్రబాబు.. టిటిడి ట్రస్ట్ సభ్యుడి పదవిని ఇస్తానని హామీ ఇచ్చినట్టు గతంలోనే వార్తలొచ్చాయి. తాజా ఉత్తర్వులతో అరికెలకు ఇచ్చిన హామీని చంద్రబాబు నిలబెట్టుకున్నట్లుగా అయింది.

మహానాడులు నిద్రపోయారు!
తిరుపతిలో జరుగుతున్న తెలుగుదేశం మహానాడు వేదికపై నేతల ప్రసంగాల సమయంలో కొంతమంది నేతలు వేదిక పైనే కునుకు తీస్తున్నారు. శనివారం బాలకృష్ణ, ఉపముఖ్యమంత్రులు కేఈ కృష్ణమూర్తి, చినరాజప్పలు నిద్రపోతున్న చిత్రాలు వచ్చాయి.
వీరి దారిలోనే ఆర్థికమంత్రి యనమల రామకృష్ణుడు, ఎంపీ మురళీమోహన్ నడిచారు. వీరు కూడా మహానాడు వేదికపై కాసేపు కునుకు తీశారు. మహానాడులో నేతల కునుకులపై సామాజిక మాధ్యమాల్లో నెటిజన్లు సెటైర్లు కురిపిస్తున్నారు.
గోడదూకిన ఎమ్మెల్యే
మహానాడు ప్రాంగణంలోకి వెళ్లేందుకు పలాస ఎమ్మెల్యే గౌతు శ్యాంసుందర్ గోడ దూకారు. కార్యకర్తల సాయంతో ఓ చిన్న గోడను దూకి వేదిక వద్దకు వెళ్లారు. ఆయనను పోలీసులు ఆపడంతో రెండో రోజు గోడ దూకారు. ఆయన వెళ్లాలనుకున్న దారిలో కార్యకర్తల తాకిడి అధికంగా ఉన్నందునే ఎమ్మెల్యేను ఆపామని పోలీసులు తెలిపారు.












Click it and Unblock the Notifications