ఆయనతో KCR స్నేహం చేయడం అంత మంచిది కాదేమో?
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డితో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ స్నేహం చేయడం అంత మంచిది కాదని వైసీపీ ఎంపీ రఘురామకృష్ణరాజు వ్యాఖ్యానించారు. పవన్ కల్యాణ్ కు మద్దతుగా నిలుస్తున్న ఓ సామాజికవర్గాన్ని విభజించాలని తమ పార్టీ నాయకత్వం ప్రయత్నిస్తున్నట్లు ఎంపీ తెలిపారు. ప్రాంతీయ తత్వాన్ని వదిలిపెట్టి జాతీయ దృక్పథంతో పార్టీ ప్రారంభించిన కేసీఆర్ లాంటి నాయకులు తోడ్పాటు అందించే విధంగా వ్యవహరించడం సరికాదన్నారు.
ఏపీకి చెందిన కొందరు విశ్రాంత అధికారులు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా శాంతి కుమారిని నియమించినందుకు అభినందనలు తెలియజేయడం ఆశ్చర్యంగా ఉందన్నారు. తమ సామాజికవర్గాన్ని కేసీఆర్ ప్రోత్సహిస్తున్నారంటూ కలవడం మరింత ఆశ్చర్యంగా ఉందన్నారు. యువశక్తి సభ తర్వాత తమ పార్టీ నాయకులు పవన్ కల్యాణ్ పై పెడబొబ్బలు పెడుతున్నారని, అంతకుముందు కేవలం ఏడ్చేవారన్నారు. శవాలను పార్శిల్ చేసేవారికి, హత్యలు చేసినవారికి బెయిల్ లభిస్తోందంటూ రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోడికత్తి కేసులోని శ్రీనివాస్ కు మాత్రం నాలుగు సంవత్సరాలుగా బెయిల్ రాకపోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు.

మంత్రుల రికార్డింగ్ డ్యాన్సులతో రాష్ట్రానికి పెట్టుబడులు వస్తాయా? అని ఎంపీ ప్రశ్నించారు. అమర్‌నాథ్, అంబటి రాంబాబు, రోజా డ్యాన్స్ చేస్తున్న ఫొటోలను రఘురామ ప్రదర్శించారు. మంత్రులు ఇలా రికార్డింగ్ డ్యాన్సులు చేస్తే రాష్ట్రానికి పరిశ్రమలు, పెట్టుబడులు పెరుగుతాయంటూ సెటైర్లు వేశారు. రాష్ట్రంలో 10వేల మందికి ఉపాధి కల్పిస్తోన్న అమర్ రాజా బ్యాటరీస్ కూడా పక్క రాష్ట్రానికి తరలిపోయిందని విచారం వ్యక్తం చేశారు. ఏపీ ప్రభుత్వంతో రూ.1.70 లక్షల కోట్ల ఒప్పందాలు కుదుర్చుకున్న కంపెనీలు కూడా వెనక్కి వెళ్లిపోయాయన్నారు.












Click it and Unblock the Notifications