చంద్రబాబు బర్త్ డే సంబరాలు... శుభాకాంక్షలు తెలిపిన మోడీ , జగన్ !
Recommended Video
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు 69వ ఏట అడుగు పెట్టారు. ఎన్నికలు పూర్తి చేసుకొని..ఇతర ప్రాంతాల్లో మిత్రపక్షాల తరపున ప్రచారం చేస్తున్న ముఖ్యమంత్రికి పార్టీ నేతలు విషెస్ చెబుతున్నారు. ప్రధాని మోదీ..వైసిపి అధినేత జగన్ సైతం ట్విట్టర్ ద్వారా చంద్రబాబుకు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. చంద్రబాబు సైతం తిరుపతి వేదికగా సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.

మోదీ..జగన్ శుభాకాంక్షలు..
ఏపి ముఖ్యమంత్రి చంద్రబాబు కు ప్రధాని మోదీ..వైసిపి అధినేత జగన్ ట్విట్టర్ ద్వారా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొంత కాలంగా చంద్రబాబు వర్సెస్ మోదీ...చంద్రబాబు వర్సెస్ జగన్ అన్నట్లుగా రాజకీయంగా నేతలు వేడి పుట్టించారు. అయితే, రాజకీయాలు వ్యక్తిగత సంబంధాల పైన ప్రభావం చూపవనే విధంగా చంద్రబాబు జన్మదినాన మోదీ..జగన్ ఇద్దరూ శుభాకాంక్షలు చెప్పారు. చంద్రబాబు ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవించాలని ప్రార్ధిస్తున్నా అంటూ ప్రధాని తన ట్విట్టర్ ఖాతాలో బాబుకు విషెస్ చెప్పారు. అదే విధంగా వైసిపి అధినేత జగన్ సైతం తన ట్విట్టర్ ఖాతా ద్వారా చంద్రబాబు నాయుడు గారికి జన్మదిన శుభాకాంక్షలు అని ట్వీట్ చేసారు. ఇద్దరు నేతలను చంద్రబాబు కృతజ్ఞతలు తెలిపారు.

సేవా కార్యక్రమాల్లో బాబు..పార్టీ నేతలు
తమ అధినేత జన్మదిన వేడుకలను పార్టీ నేతలు పండుగలా జరుపుతున్నారు. ఉండవల్లిలోని ముఖ్యమంత్రి నివాసం వద్దకు ఉదయాన్నే టిడిపి నేతలు పెద్ద ఎత్తున చేరుకున్నారు. దేవినేని ఉమా, రాజ్యసభ సభ్యుడు కనకమేడల రవీంద్ర నేతృత్వంలో చంద్రబాబు జన్మదిన వేడుకలు నిర్వహించారు. తెలుగు విద్యార్ది సంఘ నేతలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి నివాసానికి చేరుకున్నారు. సరిగ్గా ఏడాది క్రితం చంద్రబాబు ఇదే రోజున కేంద్ర ప్రభుత్వం ఏపిపై వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగా ధర్మ పోరాట దీక్ష నిర్వహించారు. ఇక, ఇప్పుడు ఎన్నికలు పూర్తయి..ఫలితాల కోసం ఎదురు చూస్తున్న వేళ టిడిపి అధినేత జన్మదినం మరింత ఘనంగా నిర్వహిస్తున్నారు. చంద్రబాబు సైతం హైదరాబాద్ వెళ్లి అక్కడ ఓ వివాహ కార్యక్రమంలో పాల్గొంటున్నారు. ఆ తరువాత కుటుంబ సభ్యులతో కలిసి తిరుపతి వెళ్లనున్నారు. అక్కడ ఎన్టీఆర్ ట్రస్టు ఆధ్వర్యంలో బ్లడ్ బ్యాంకును చంద్రబాబు ప్రారంభించనున్నారు.












Click it and Unblock the Notifications