కూటమి ఏదైనా వైసీపీ మద్దతు కావాల్సిందే; ఇంట్రెస్టింగ్!!
2024 ఎన్నికల లక్ష్యంగా దేశంలో ఆసక్తికర రాజకీయ పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఒకపక్క బెంగళూరులో విపక్షాలు భేటీ అవుతుంటే, మరోపక్క దేశ రాజధాని ఢిల్లీలో బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి నేడు కీలక భేటీ నిర్వహిస్తోంది. పోటాపోటీగా జరుగుతున్న భేటీలతో దేశం మొత్తం ఆసక్తి ప్రస్తుతం ఈ రెండు కూటమిల భేటీల పైన కేంద్రీకృతమైంది.
ఏ కూటమిలో ఎవరిని ఆహ్వానించారు? ఎవరిని ఆహ్వానించలేదు? వారి లక్ష్యం ఏమిటి అన్నది? ప్రధానంగా చర్చ జరుగుతుంది. సార్వత్రిక ఎన్నికలలో విజయం సాధించడమే లక్ష్యంగా ఎన్డీఏ, యూపీఏ కూటమిల సమావేశాలు జరుగుతున్న వేళ ఆసక్తికరమైన ట్వీట్ చేశారు వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి. ప్రస్తుతం ఆయన చేసిన ట్వీట్ కొత్త చర్చకు కారణమైంది. 30 పార్టీలతో కూడిన ఎన్డీయే ఢిల్లీలో, 24 విపక్షాలు బెంగళూరులో సమావేశమవుతున్నాయి.

ఈసారి 2024లో ఢిల్లీకి వెళ్లే మార్గం ఏపీ గుండా వెళుతుంది. వైయస్సార్సీపి మద్దతుతోనే ప్రభుత్వం ఏర్పాటు చేయడం కేంద్రంలో సాధ్యమవుతుందని ఆయన ఆసక్తికరమైన ట్వీట్ చేశారు. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజల ఆశీర్వాదాలు మరియు ప్రజాదరణ పొందిన ఓటు బ్యాంక్ ఉంది. జాతీయ మీడియాతో సహా ఇప్పటివరకు చేసిన అన్ని సర్వేలు వైఎస్సార్‌సీపీ మళ్లీ ఘనవిజయం సాధిస్తుందని సూచిస్తున్నాయి అంటూ పేర్కొన్నారు.
దేశ రాజకీయాలను కీలక మలుపు తిప్పడం లో వైసీపీ పాత్ర తప్పనిసరిగా ఉంటుందని, ఏ కూటమి కైనా వైసిపి అవసరం ఉందని, అంతగా వైసిపి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎదిగిందని విజయ సాయి రెడ్డి ట్వీట్ చేశారు. ప్రస్తుతం సాయి రెడ్డి చేసిన ఈ ట్వీట్ రాజకీయ వర్గాలలో ఆసక్తికర చర్చకు కారణంగా మారింది. విజయసాయిరెడ్డి చేసిన ట్వీట్ నేపథ్యంలో నెటిజన్లు రకరకాలుగా స్పందిస్తున్నారు.
కొందరు ఢిల్లీకి వెళ్లే మార్గం ఏపీ గుండా ఉంది అన్న అన్న సాయి రెడ్డి పై సెటైర్లు వేస్తున్నారు. ఏపీలో రోడ్లు అంతగా బాలేదు ఏపీ రోడ్ లు అవసరం లేదు అంటూ ట్వీట్ చేస్తున్నారు. వైఎస్ఆర్సిపి కింగ్ మేకర్ గా వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో నిలుస్తుంది అంటూ విజయసాయిరెడ్డి తన ట్వీట్ ద్వారా తెలియజేసినట్టు కొందరు చెబుతున్నారు. ఎన్డీఏ కూటమికైనా, విపక్షాల కూటమికైనా ఆహ్వానిస్తే వెళ్లడానికి వైసిపి తలుపులు తెరిచే ఉన్నాయి అంటూ మరికొందరు స్పందిస్తున్నారు.












Click it and Unblock the Notifications