పెన్షన్ల పంపిణీపై రూటు మార్చిన కూటమి నేతలు..!!
ఏపీలో ఎన్నికల వేళ మరోసారి పెన్షన్ల అంశం కీలకంగా మారుతోంది. ఏప్రిల్ 1వ తేదీన పెన్షన్ల వివాదం రాజకీయ దుమారానికి కారణమైంది. రాజకీయంగా పై చేయి సాధించేందుకు పార్టీలు ప్రయత్నాలు చేసాయి. దీంతో, మే 1న పంపిణీ చేయాల్సిన పెన్షన్ల పంపిణీ పైన టీడీపీ కూటమి పార్టీలు అప్రమత్తం అయ్యాయి. నేరుగా ఎన్నికల సంఘానికి లేఖలు రాసాయి. ఈసీ ఇప్పటికే సీఎస్ కు కీలక సూచనలు చేసింది. ఎన్డీఏ పార్టీల నేతలు ఈ వ్యవహారంలో వ్యూహాత్మకంగా ముందుకు వెళ్తున్నాయి.
పెన్షన్ల వివాదం
పెన్షన్ల పంపిణీ ఇంటి వద్దకే వెళ్లి చేయాలని కూటమి నేతలు అధికారుల పై ఒత్తిడి పెంచుతున్నారు. ఇప్పటికే ఎన్నికల సంఘానికి లేఖలు రాసారు. ఈసీ ఇదే అంశం పైన సీఎస్ కు సూచనలు చేస్తూనే వివరణ కోరింది. అయితే, గత నెల తరహాలోనే విద్యాంగులు, కదలలేని వారికి ఇంటి వద్ద పంపిణీ చేస్తామని..మిగిలిన వారికి వార్డు సచివాలయాల వద్ద అందిస్తామని స్పష్టత ఇచ్చారు. మూడో తేదీ లోగా పంపిణీ పూర్తి చేస్తామని వివరించారు. ఇదే సమయంలో కూటమి నేతలు ఈ వ్యవహారంలో సీఎస్ ను టార్గెట్ చేస్తున్నారు. ఇప్పటికే సీఎస్ ను తప్పించాలంటూ పురందేశ్వరితో సహా కూటమి నేతలు ఎన్నికల సంఘానికి వరుసగా లేఖలు రాసారు.

సీఎస్ పై ఒత్తిడి
తాజాగా సీఎస్ ను కలిసిన కూటమి నేతలు చాంబర్ వద్ద ధర్నా నిర్వహించారు. పెన్షన్లను ఇంటి వద్దనే అందించాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వానికి, సీఎం జగన్ కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తెలుగుదేశం, బిజెపి, జనసేన నేతలు సీఎస్ జవహర్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. మే 1వ తేదీ వస్తోందని, రాష్ట్రంలో పెన్షన్ల పంపిణీపై సహేతుక నిర్ణయం తీసుకోవాలని, ఈసీ ఆదేశాల ప్రకారం నడుచుకోవాలని సీఎస్ ను కోరారు. పెన్షన్ కోసం ఎవరూ ఇబ్బంది పడకుండా చూడాలని కోరినా, సీఎస్ తమ విన్నపాన్ని లెక్కచేయకుండా వ్యవహరిస్తున్నారని వర్ల రామయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. మే నెలలో పెన్షన్ పంపిణీలో ఒక్క ప్రాణం పోయినా సీఎస్ దే బాధ్యత అని స్పష్టం చేశారు.

మే 1 ఏం జరగనుంది
దీంతో..ఎన్నికలు సమీపిస్తున్న వేళ మరోసారి పెన్షన్ల వ్యవహారం ఏపీలో మరోసారి ఉత్కంఠ పెంచుతోంది. మరో రెండు రోజులే సమయం ఉండటంతో ఇంటి వద్దకు వెళ్లి పెన్షన్ల పంపిణీ చేయాలనే డిమాండ్ బలంగా వినిపిస్తోంది. అధికారులు మాత్రం గత నెలలో మాదిరే ఈ సారి సచివాలయాకు రాలేని వారికి పెన్షన్లు ఇంటి వద్ద అందిస్తామని చెబుతున్నారు. ఇతరులకు సచివాలయాల్లోనే పెన్షన్ల పంపిణీ మూడో లేదీ రాత్రి లోగా పూర్తి చేస్తామని చెబుతున్నారు. ఈ సమయంలో పెన్షన్ల అంశం ఎలాంటి టర్న్ తీసుకుంటుందనేది కీలకంగా మారుతోంది.












Click it and Unblock the Notifications