ఆనందయ్యపై వర్మ సంచలన ట్వీట్-ఆర్మీతో భద్రత -జాతి సంపదగా గుర్తించలేరా ?
దేశవ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ కల్లోలం రేపుతున్న వేళ నెల్లూరు ఆయుర్వేద డాక్టర్ ఆనందయ్య చేస్తున్న వైద్యంతో వైరస్ తగ్గుతోందన్న ప్రచారం ఇప్పుడు దేశవ్యాప్తంగా సాగుతోంది. వివిధ రాష్ట్రాలకు చెందిన రోగులు నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి క్యూ కడుతున్నారు. చాలామంది సెలబ్రిటీలు ఆనందయ్యపై ప్రశంసల జల్లు కురిపిస్తూ ట్వీట్లు కూడా పెడుతున్నారు. ఇదే క్రమంలో టాలీవుడ్ డైరెక్టర్ రామ్‌గోపాల్ వర్మ కూడా స్పందించారు.
Recommended Video
ఎప్పుడూ సంచలన వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచే రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు ఆనందయ్యపై దృష్టిపెట్టారు. ఆనందయ్యను ఆకాశానికెత్తేశారు. ఆనందయ్యను జాతి సంపదగా గుర్తించలేరా అని ప్రభుత్వాన్ని వర్మ సూటిగా ప్రశ్నించారు. అంతే కాదు ఆయనకు మిలటరీతో భద్రత కల్పించాలని కూడా తన తాజా ట్వీట్‌లో వర్మ ప్రభుత్వానికి సూచించారు. తద్వారా ఆనందయ్య వైద్యంపై ఆయన ఎంతగా ఇంప్రెస్ అయ్యారో చెప్పకనే చెప్పారు.

గతంలో సోనూ సూద్‌తో పాటు పలువురు సామాజిక సేవ చేస్తున్న వారిపై ట్వీట్లు పెట్టిన రామ్‌గోపాల్ వర్మ ఇప్పుడు ఆనందయ్య వైద్యంపై ట్వీట్ పెట్టడం సంచలనంగా మారింది. అతి తక్కువ కాలంలో తన వైద్యంతో ఎంతో ప్రాచుర్యం సంపాదించుకున్న ఆనందయ్యపై వర్మ పెట్టిన ట్వీట్ కూడా వైరల్ అవుతోంది. ఈ ట్వీట్ చూసిన వారు వర్మను ప్రశంసిస్తూ రీట్వీట్ కూడా చేస్తున్నారు. గతంలో ఎన్నో వివాదాస్పద అంశాలపై ట్వీట్లు చేసి విమర్శల పాలైన అనుభవం ఉన్న వర్మ ఈసారి ఆనందయ్యపై ప్రసంసలు కురిపించడం, ఆయనకు సెక్యూరిటీ ఇవ్వాలని కోరడం చర్చనీయాంశంగా మారింది.
Shouldn’t the government declare ANANDAYYA, as a national treasure and give him Military Security? 😳😳😳
— Ram Gopal Varma (@RGVzoomin) May 22, 2021