కల్తీ మద్యం నిరోధించేందుకు యాప్:మెడికల్ కాలేజీలపై సీఎం సంచలన ప్రకటన.!
కల్తీ మద్యం తయారీదారులు, వ్యాపారులపై రాష్ట్ర ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ములకలచెరువు కల్తీ మద్యం తయారీదారులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అయితే, కొందరు వ్యక్తులు రాజకీయ లబ్ధి కోసం కల్తీ మద్యం కేసు గురించి తప్పుడు కథనాలను ప్రచారం చేస్తున్నారని సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు. కల్తీ మద్యం తయారీని నిరోధించడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక యాప్‌ను ప్రవేశపెట్టబోతోందని తెలిపారు. మద్యం బాటిళ్లపై ఉన్న హోలోగ్రామ్‌ను స్కాన్ చేయడం ద్వారా ఉత్పత్తి కల్తీదా లేక అసలుదా అని వినియోగదారులు తెలుసుకోవచ్చని చెప్పారు.
జీఎస్టీ 2.0 సంస్కరణలు,కల్తీ మద్యంపై చర్యలు
ప్రధానమంత్రి నరేంద్ర మోడీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం పేదలు, మధ్యతరగతి ప్రజలకు లబ్ధి చేకూర్చేందుకు జీఎస్టీ 2.0 సంస్కరణలను ప్రవేశపెట్టిందని ముఖ్యమంత్రి చెప్పారు. జీఎస్టీ సంస్కరణల వల్ల నిత్యావసర వస్తువుల ధరలు తగ్గాయని, ఇది పేదలకు ఎంతో మేలు చేస్తుందని తెలిపారు. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను ప్రజలకు వివరించడానికి అక్టోబరు 16న ప్రధాని మోడీ కర్నూలు జిల్లాను సందర్శించనున్నారని ముఖ్యమంత్రి తెలియజేశారు.

పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలకు అభ్యంతరాలపై..
పీపీపీ (PPP) విధానంలో కొత్త మెడికల్ కాలేజీల అభివృద్ధిపై అభ్యంతరాలు వ్యక్తం చేయడంపై ముఖ్యమంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారు. పీపీపీ విధానంలో ఏర్పాటు చేసే వైద్య కళాశాలల ద్వారా అదనంగా 110 మెడికల్ సీట్లు లభిస్తాయని ఆయన వివరించారు. ఈ విధానంలో కళాశాలలు రెండేళ్లలో అందుబాటులోకి వస్తాయని, అదే ప్రభుత్వం నేరుగా అభివృద్ధి చేపడితే ప్రాజెక్టు పూర్తి కావడానికి ఇరవై ఏళ్లు పడుతుందని ఆయన స్పష్టం చేశారు.
స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ప్రారంభం
అంతకుముందు సీఎం చంద్రబాబు నెల్లూరులోని మైపాడు గేట్ వద్ద ఏర్పాటు చేసిన స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్‌ను వర్చువల్‌గా ప్రారంభించారు.వీధి వ్యాపారులకు లబ్ధి చేకూర్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం 30 మాడ్యులర్ కంటైనర్లలో 120 షాపులను ఏర్పాటు చేసింది.ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ.. గత 18 ఏళ్లుగా వ్యాపారం చేస్తున్న వీధి వ్యాపారులు ఈ స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ ఏర్పాటుతో ఇప్పుడు చిన్న పారిశ్రామికవేత్తలుగా (ఎంటర్‌ప్రెన్యూర్స్) మారారని తెలిపారు. షాపులను పారదర్శకంగా కేటాయించామని చెప్పిన చంద్రబాబు...లబ్ధిదారులతో వర్చువల్‌గా మాట్లాడారు.శాశ్వత దుకాణాలు దక్కడంపై వారు సంతోషం వ్యక్తం చేశారు.
స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ అనేది వీధి వ్యాపారులను చిన్న పారిశ్రామికవేత్తలుగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన వినూత్న ఆలోచన అని ముఖ్యమంత్రి అన్నారు. పేదల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి కూటమి ప్రభుత్వం అనేక కార్యక్రమాలను ప్రారంభించిందని గుర్తుచేశారు. డ్వాక్రా గ్రూపుల నుంచి లక్ష మంది మహిళలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దాలని లక్ష్యంగా పెట్టుకున్నామని పేర్కొన్నారు.
స్మార్ట్ స్ట్రీట్ వెండింగ్ మార్కెట్ లబ్ధిదారులు, ముఖ్యంగా మహిళలు వర్చువల్‌గా ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. తమ జీవన ప్రమాణాలను మెరుగుపరిచేందుకు చేపడుతున్న ప్రయత్నాలకు ముఖ్యమంత్రి మద్దతు ఇస్తున్నారని వారు కొనియాడారు.












Click it and Unblock the Notifications