ప్రత్యేక మేనిఫెస్టో విడుదల చేసిన సాయిరెడ్డి
Vijayasai Reddy: ఈ సార్వత్రిక ఎన్నికల్లో నెల్లూరు లోక్‌సభ నుంచి అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తోన్న సీనియర్ నేత విజయసాయి రెడ్డి ప్రత్యేకంగా స్థానిక మేనిఫెస్టోను విడుదల చేశారు. నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలను సమగ్రంగా అభివృద్ధి చేయడానికి ఉద్దేశించిన మేనిఫెస్టో ఇది. ఇందులో 46 హామీలను పొందుపరిచారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్ఫూర్తితో నెల్లూరు లోక్‌సభ పరిధిలోని ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల అభివృద్ధి కోసం ఓ సమగ్ర డాక్యుమెంట్‌ను రూపొందించామని అన్నారు. సాధ్యపడే వాటిని పూర్తిస్థాయిలో నెరవేర్చేలా ఈ లోకల్ మేనిఫెస్టోను రూపొందించామని చెప్పారు.

నెల్లూరు లోక్‌సభ, దాని పరిధిలోని ఏడు అసెంబ్లీ స్థానాలను క్లీన్ స్వీప్ చేయబోతోన్నామని, ఆ విశ్వాసంతో ఎన్నికలను ఎదుర్కొంటోన్నామని సాయిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. వైఎస్ఆర్సీపీ ద్వారా మాత్రమే తమ కలలు సాకారం అవుతాయని నెల్లూరు జిల్లా ప్రజలు బలంగా నమ్ముతున్నారని పేర్కొన్నారు.
కేంద్రంలో మళ్లీ బీజేపీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉందని, యూనిఫాం సివిల్ కోడ్‌ను తప్పకుండా అమలు చేస్తుందని విజయసాయిరెడ్డి అన్నారు. ముస్లింలకు వ్యతిరేకంగా ఉండే ఈ సివిల్ కోడ్‌ను ఎన్డీఏ భాగస్వామిగా తెలుగుదేశం పార్టీ సమర్ధిస్తుందా? లేదా? అని ప్రశ్నించారు. ఆ విషయంపై చంద్రబాబును పలుమార్లు ప్రశ్నించినా సరైన సమాధానం చెప్పలేదని అన్నారు.
యూనిఫాం సివిల్ కోడ్‌కు సంబంధించి కేంద్ర ప్రభుత్వ ముసాయిదాను సైతం సిద్ధం చేసిందని సాయిరెడ్డి తెలిపారు. దీనిపై అధ్యయనానికి ఒక కమిటీని వేశారని, లా కమిషన్‌కు రిఫర్ చేశారని వివరించారు. దీన్ని ముస్లింలు బలంగా వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. క్రిస్టియన్లు, దళితులు, బీసీలు సైతం యూసీసీని వ్యతిరేకిస్తున్నారని, ఇలాంటి బిల్లును వైఎస్‌ఆర్సీపీ ఎట్టిపరిస్థితుల్లో సమర్థించదని సాయిరెడ్డి తేల్చి చెప్పారు.
భిన్న సంస్కృతులు, భిన్న సాంప్రదాయాలు ఉన్న ఈ సమాజంలో ఏకాభిప్రాయం లేకుండా ఒక చట్టాన్ని ఏ ఇతర సామాజికవర్గంపైన రుద్దలేమని, అలా రుద్దకూడదని వ్యాఖ్యానించారు. అది ప్రజాస్వామ్యా విరుద్ధమని తాము భావిస్తున్నామని పేర్కొన్నారు. ఈ యూనిఫాం సివిల్ కోడ్‌పై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్‌తో పాటు బీజేపీ స్థానిక నాయకత్వం సూటిగా సమాధానం చెప్పాల్సిందేనని నిలదీశారు.
టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి మేనిఫెస్టోపై చంద్రబాబు, పవన్‌కళ్యాణ్ ఫొటోలు మాత్రమే ఉన్నాయని, మిత్రపక్షమైన బీజేపీ సీనియర్ నాయకులు, ప్రధాని నరేంద్ర మోదీ ఫొటోను ఎందుకు పెట్టలేదని సాయిరెడ్డి ప్రశ్నించారు. ఇదంతా ముస్లిం సామాజికవర్గ ఓట్ల కోసమేనని అన్నారు. మోదీ ఫొటో వాడితే ముస్లింలు తమకు ఓట్లు వేయరనే భయంతోనే చంద్రబాబు నడిపిస్తోన్న కుట్రగా అభివర్ణించారు.












Click it and Unblock the Notifications