కొత్త జిల్లాల రగడ-రంగా పేరుపై వంగవీటి దీక్ష-మార్కాపురం కోసం మంత్రి వెల్లంపల్లి ఘెరావ్
ఏపీలో కొత్త జిల్లాలు, వాటి సరిహద్దులు, పేర్లు వ్యవహారంపై రచ్చ ఆగడం లేదు. ఇప్పటికే ప్రభుత్వం అభ్యంతరాలు తీసుకుని పరిశీలిస్తున్నా పలు చోట్ల మాత్రం నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. ఇదే క్రమంలో ఇవాళ విజయవాడ జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలంటూ నిరసన దీక్ష సాగింది. మరోవైపు మార్కాపురం జిల్లా కోరుతూ మంత్రి వెల్లంపల్లిని ప్రకాశం జిల్లాలో నిరసనకారులు అడ్డుకున్నారు.

కొత్త జిల్లాలపై ఆగని రచ్చ
ఏపీలో కొత్త జిల్లాల వివాదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వం తమ నిర్ణయంపై అభ్యంతరాలు స్వీకరించి పరిశీలిస్తున్నట్లు ప్రకటించినా పార్లమెంటు స్ధానాల ప్రాతిపదికగా చేపట్టిన జిల్లాల విభజనతో పాటు వాటి పేర్లు కలకలం రేపుతూనే ఉన్నాయి. దీంతో ప్రభుత్వానికి ఈ వ్యవహారం ఇబ్బందికరంగా మారుతోంది. పలు చోట్ల ఇప్పటికే జిల్లా కేంద్రాల విషయంలో ఆందోళనలు కొనసాగుతుండగా. తాజాగా ఇది కాస్తా మంత్రుల్ని అడ్డుకునే వరకూ వెళ్లింది.

వెల్లంపల్లికి నిరసన సెగ
ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటు సెగ మంత్రులను కూడా తాకుతోంది. ఇవాళ ప్రకాశం జిల్లాకు వెళ్లిన దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి కి జిల్లాల నిరసన సెగ తగిలింది. మార్కాపురంలో ఓ కార్యక్రమానికి వచ్చిన మంత్రి వెల్లంపల్లిని నిరసనకారులు అడ్డుకున్నారు. మంత్రి కాన్వాయ్ ను అడ్డుకుని మార్కాపురం జిల్లా సాధన సమితి నేతలు నిరసన వ్యక్తం చేశారు. దీంతో నిరసనకారులను పోలీసులు అడ్డుకున్నారు. చివరికి మంత్రికి జిల్లా సాధన సమితి నేతలు వినతిపత్రం అందజేసి వెళ్లారు. దీంతో సిఎం దృష్టికి తీసుకు వెళ్తానని వారికి వెల్లంపల్లి హామీ ఇచ్చారు.

రంగా పేరు కోసం వంగవీటి దీక్ష
పశ్చిమ కృష్ణాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలంటూ రాధారంగ మిత్ర మండలి అధ్యక్షుడు, బీజేపీ నేత వంగవీటి నరేంద్ర విజయవాడలో నిరాహార దీక్ష చేపట్టారపు. ఉదయం పది గంటల నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు దీక్ష చేస్తున్నారు. ఈ దీక్షకు వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన రంగా అభిమానులు మద్దతు పలికారు.
ఈ సందరఅభంగా మాట్లాడిన వంగవీటి నరేంద్ర.. వంగవీటి మోహనరంగా వ్యక్తి కాదు, ఓ శక్తి గా ఎదిగారని తెలిపారు. కుల, మతాలకు అతీతంగా అందరరి మనసుల్లో స్థానం సంపాదించారన్నారు. ఆయన మరణ వార్తను ముప్పై యేళ్ల కిందటే ప్రపంచ వ్యాప్తంగా బీబీసీ కవర్ చేసిందన్నారు.అటువంటి గొప్ప వ్యక్తి పేరును ఈ జిల్లాకు పెట్టాలని కోరుతున్నానన్నారు.
ఓట్ల కోసం రంగా బొమ్మ, పేరు వాడుకునే నాయకులు ఎందరో ఉన్నారని, రంగ పేరుతో ఓట్లు అడుగుతారు.. కానీ జిల్లాకు రంగా పేరు కోసం కృషి చేయరా అని నరేంద్ర ప్రశ్నించారు. వైసీపీలో ఉన్న రంగా అభిమానులు సిఎం దృష్టి కి ఈ విషయాన్ని ఎందుకు తీసుకెళ్లరని నిలదీశారు. వైయస్, రంగాలు ఆనాడు మిత్రులుగా కాంగ్రెస్ లో పని చేశారని,
కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టిన విధంగా విజయవాడ జిల్లాకు రంగ పేరు పెట్టాలని నరేంద్ర డిమాండ్ చేశారు.
తూర్పు కృష్ణా కు యన్టీఆర్, పశ్చిమ కృష్ణాకు వంగవీటి మోహనరంగా పేరు పెట్టాలని కోరారు. ప్రభుత్వం సానుకూలంగా స్పందించక పోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన ఉధృతం చేస్తామన్నారు.












Click it and Unblock the Notifications