Raghurama: రఘురామా మజాకా? ఏకంగా దర్యాప్తు అధికారే అవుట్ ..!
ఏపీలో టీడీపీ ఎమ్మెల్యే, ఒకప్పటి వైసీపీ రెబెల్ ఎంపీ రఘురామకృష్ణంరాజు ఏం చేసినా సంచలనమే. అలాగే ఆయనపై గత వైసీపీ ప్రభుత్వంలో జరిగిన కస్టడీ హింస కేసు దర్యాప్తులోనూ అంతే స్ధాయిలో సంచలనాలు నమోదవుతున్నాయి. ఇప్పటికే తనపై కస్టడీ హింస కేసులో దర్యాప్తు కోరుతూ రఘురామ దాఖలు చేసిన కేసును గుంటూరు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. అయితే విచారణ సందర్భంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి.
రఘురామకృష్ణంరాజుపై అప్పట్లో కస్టడీ హింస కేసులో ఐపీఎస్ లు సీతారామాంజనేయులు, పీవీ సునీల్ కుమార్ తో పాటు డీఎస్పీ విజయ్ పాల్, అప్పటి సీఎం వైఎస్ జగన్ నిందితులుగా ఉన్నారు. అయితే ఈ కేసులో విచారణ కోసం ఇప్పటికే దర్యాప్తు అధికారిగా డీజీపీ ఆఫీసు అడ్మిన్ ఎస్పీ రమణమూర్తిని నియమించారు. ఆయన విజయ్ పాల్ ను ఇప్పటికే విచారించారు. అయితే విచారణలో ఎదురైన పరిణామాలతో రమణమూర్తికి షాక్ తప్పలేదు.

విజయ పాల్ విచారణలో దర్యాప్తుకు ఏమాత్రం సహకరించకపోవడం, అప్పట్లో రఘురామపై కస్టడీలో హింసకు కారకులెవరో చెప్పకపోవడం, అంతకు మించి ఆయన్ను ప్రశ్నిస్తే ఆయన వెనుక ఉన్న అధికారుల నుంచి భవిష్యత్తులో తలెత్తే ఇబ్బందులపై దర్యాప్తు అధికారి రమణమూర్తి ఆందోళన చెందుతుండటంతో ప్రభుత్వం ఆత్మరక్షణలో పడింది. ఈ నేపథ్యంలో రఘురామపై దాడికి జరిగిన మొత్తం ప్లాన్ బయటికి రావాలంటే ప్రభుత్వం మరో నిర్ణయం తీసుకోక తప్పని పరిస్ధితి ఎదురైంది. దీంతో ప్రభుత్వం కీలక ఉత్తర్వులు జారీ చేసింది.
రఘురామకృష్ణంరాజుపై కస్టడీలో జరిగిన హింసలో వాస్తవాలు వెలుగుతీసేందుకు వీలుగా ప్రకాశం జిల్లా ఎస్పీ దామోదర్ ను దర్యాప్తు అధికారిగా నియమిస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు రమణమూర్తి స్ధానంలో ఇకపై ఈ కేసును దర్యాప్తు అధికారిగా దామోదర్ పర్యవేక్షించనున్నారు. మరి దామోదర్ కు అయినా రఘురామ కేసు నిందితులు విచారణలో సహకరిస్తారా లేదా అన్నది చూడాల్సి ఉంది.












Click it and Unblock the Notifications