కృష్ణా జిల్లాకు వంగవీటి పేరు, తిరుపతి ఇక - కొత్త జిల్లాలు ఇలా, సరిహద్దుల మార్పు..!?
ఏపీ ప్రభుత్వం కొత్త జిల్లాల పైన కసరత్తు చేస్తోంది. ఇందు కోసం ఏర్పాటైన మంత్రివర్గ ఉప సంఘం జిల్లాల పునర్విభజన పైన సూచనలు, సలహాలు స్వీకరిస్తోంది. ఇప్పటికే పలువురి నుంచి కేబినెట్ సబ్ కమిటీకి పలు ప్రతిపాదనలు అందాయి. కాగా, ఆరు కొత్త జిల్లాల పైన నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. మండలాల పైన కసరత్తు జరుగుతోంది. ఎన్నికల సమయంలో కొత్త జిల్లాల పైన ఇచ్చిన హామీలను పరిగణలోకి తీసుకున్నారు. ఇదే సమయంలో జిల్లాల పేర్ల పైన పలు ప్రతిపాదనలు ప్రభుత్వానికి అందాయి.
పెరగనున్న జిల్లాలు
ఏపీలో ప్రస్తుతం ఉన్న 26 జిల్లాలు 32కి పెరగనున్నాయి. కొత్త జిల్లాల పైన మంత్రివర్గ ఉప సంఘం సమావేశాలు కొనసాగుతున్నాయి. ప్రజా ప్రతినిధులు, ప్రజలు, మేధావుల నుంచి జిల్లాల పునర్విభజనకు సంబంధించిన అంశాలపై వినతులు స్వీకరిస్తున్నారు. వాటిని పరిశీలించి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనున్నారు. రాష్ట్రంలో 6 కొత్త జిల్లాలు ఏర్పడనున్నాయి. ప్రతిపాదిత కొత్త జిల్లాలుగా పలాస, అమరావతి, మార్కాపురం, గూడూరు, మదనపల్లె, రాజంపేట, పోలవరం మారనున్నట్లు తెలిసింది. ఇందులో ఒకట్రెండు స్థానాల్లో మార్పులు, చేర్పులు ఉండే అవకాశం ఉంది. అదే విధంగా జిల్లాల సరిహద్దులు, పేర్లు మార్పు పైన సూచనలు స్వీకరిస్తున్నారు.

పేర్ల పైనా ప్రతిపాదనలు
ప్రస్తుతం పలు జిల్లాలకు ప్రముఖుల పేర్లు పెట్టాలనే ప్రతిపాదనలు అందుతున్నాయి. అందులో భాగంగా కృష్ణా జిల్లాకు వంగవీటి రంగా పేరు పెట్టాలనే ప్రతిపాదన తెర మీదకు వచ్చింది. ఇప్పటి కే ఎన్డీఆర్ జిల్లా ఏర్పాటు అయింది. అదే విధంగా తిరుపతిని బాలాజీ జిల్లాగా పేరు మార్చాలనే ప్రతిపాదన పైనా నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. పల్నాడుకు జాషువా పేరు పెట్టాలని స్థానికంగా డిమాండ్ ఉంది. ఇక.. బాపట్లకు దుగ్గిరాల గోపాల క్రిష్ణయ్య పేరు పరిశీలించాలని స్థానికులు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. పేర్లు మార్పు విషయంలో ప్రతిపాదనల పైన అందరి అభిప్రాయాల ను పరిగణలోకి తీసుకొని మంత్రివర్గ ఉప సంఘం ప్రభుత్వానికి సిఫారసు చేయనుంది.
కసరత్తు షురూ
గత వైసిపి పాలనలో కొన్ని జిల్లాల పేర్లు, రెవెన్యూ డివిజన్ల ఏర్పాటు, మండలాల విలీనంతోపాటు భౌగోళిక అంశాల ఎంపిక ప్రక్రియ లోప యిష్టంగా జరిగిందని కూటమి ప్రభుత్వం పలు సందర్భాల్లో విమర్శించింది. తాము అధికారంలోకి వస్తే లోపాలను సరిచేస్తామని సిఎం చంద్రబాబు ఎన్నికల పర్యటనల్లో హామీ ఇచ్చింది. అందుకు అనుగుణంగానే మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమించింది. ఇప్పటికే కసరత్తు ప్రారంభించిన ఉప సంఘ సెప్టెంబర్ నుంచి జిల్లాల్లో పర్యటనలు చేసి అభిప్రాయ సేకరణ చేయనుంది. ఆ తరువాత ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది. పునర్విభజనలో భాగంగా కొన్ని జిల్లాల కేంద్రాల మార్పు, రెవెన్యూ డివిజన్ల సర్దుబాట్లు ఉండే అవకాశం ఉంది. సంక్రాంతి వేళ కొత్త జిల్లాలు - డివిజన్ల ఏర్పాటు, పేర్ల మార్పు పైన ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తోంది.












Click it and Unblock the Notifications