తెలంగాణకు మరో షాక్: 'మీరే' లేఖను బయటపెట్టిన ఏపీ పోలీస్?
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వానికి మరో షాక్! ఆంధ్రప్రదేశ్ పోలీసు శాఖకు తెలంగాణ రాష్ట్ర పోలీసు శాఖ రాసిన లేఖ వివరాలు బయటకు వచ్చినట్లుగా తెలుస్తోంది. మీ ముఖ్యమంత్రి, మీ మంత్రులకు మీరే భద్రత కల్పించుకోవాలని తెలంగాణ పోలీసు శాఖ లేఖ రాసిందని అంటున్నారు.
హైదరాబాదులో ఏపీ పోలీసుల ప్రవేశాన్ని తెలంగాణ పోలీసులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న విషయం తెలిసిందే. దీనిపై తెలంగాణ లోపల ఒకమాట, బయట ఓ మాట మాట్లాడుతోందని అంటున్నారు.
ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాదులో శాంతిభద్రతల పరిరక్షణ తమ పరిధిలోనివేనని తెలంగాణ డీజీపీ బహిరంగంగా ప్రకటించిన విషయం తెలిసిందే.

అయితే, పోలీసు శాఖ తీరు అందుకు విరుద్ధంగా ఉందనే వాదనలు వినిపిస్తున్నాయి. హైదరాబాదులో మీ భద్రత కోసం మీ బలగాలను వినియోగించుకోవాలని తెలంగాణ పోలీసు శాఖ ఆదేశాల నేపథ్యంలోనే హైదరాబాదులో ఏపీ పోలీసు బలగాలు మోహరించామని... ఈ మేరకు ఏపీ ఎస్పీ గౌతమ్ సవాంగ్ ఏపీ డీజీపీ జేవీ రాముడు ఎదుట తెలంగాణ పోలీసు శాఖ జారీ చేసిన లేఖను పెట్టినట్లుగా తెలుస్తోంది.
కాగా, తెలంగాణ ప్రభుత్వ ఆధీనంలోనే హైదరాబాద్ ఉంటుందని, తెలుగు రాష్ట్రాల ఉమ్మడి రాజధానిలో శాంతి భద్రతలను తెలంగాణ పోలీసులే చూసుకుంటారని డీజీపీ అనురాగ్ శర్మ చెప్పిన విషయం తెలిసిందే. వరంగల్‌లోని పోలీసు హెడ్ క్వార్టర్స్‌లో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయాన్ని తెలిపారు.












Click it and Unblock the Notifications