నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ చైర్మన్లు - ఛాన్స్ దక్కేదెవరికి : ఆ పదవుల్లో వారికే ఇస్తారా..!!
ఏపీలో కొత్త జిల్లాల కసరత్తు వేగవంతం చేసారు. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాలను పార్లమెంటరీ నియోజకవర్గాల వారీగా 26 జిల్లాలుగా మార్చేందుకు నోటిఫికేషన్ విడుదల అయింది. ఇక, మార్చి 10వ తేదీ వరకు అభిప్రాయ సేకరణకు అవకాశం ఇచ్చి.. ఆ తరువాత తుది ముసాయిదా విడుదల చేయనున్నారు. ఉగాది నాటికి రాష్ట్రంలో కొత్తగా ఏర్పడే 13 జిల్లాల్లోనూ పాలన ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించింది.
అందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 13 జిల్లా పరిషత్ (జెడ్పీ)లను 26 జెడ్పీలుగా విభజించి, కొత్తగా ఏర్పాటయ్యే జిల్లాలకు వేరుగా జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకు వీలుగా కసరత్తు చేస్తున్నట్లుగా విశ్వసనీయ సమాచారం.

మరో 13 కొత్త జిల్లా పరిషత్ లు
దీంతో..కొత్త జిల్లాల్లో జెడ్పీటీసీల సంఖ్య అదే విధంగా కొనసాగినా.. జిల్లా పరిషత్ ఛైర్మన్ మాత్రం కొత్తగా ఎన్నిక కానున్నారు. 13 జిల్లాల్లోనూ వైసీపీకే అవకాశం దక్కనుంది. ప్రస్తుతం కొనసాగుతున్న జిల్లా పరిషర్ ఛైర్మన్ల ఎన్నిక అయి అయిదు నెలలు అయింది. 13 జిల్లాల్లో ఒక్కో జెడ్పీ చైర్మన్, ఇద్దరేసి వైస్ చైర్మన్ల చొప్పున గత ఏడాది సెప్టెంబర్ 25వ తేదీన ఎన్నికయ్యారు.
వారికి ఇంకా నాలుగున్నారేళ్లకు పైగా సమయం ఉంది. కానీ, కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత కూడా సుదీర్ఘ కాలం పాటు పాత జిల్లా ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్లను కొనసాగించడం మంచిది కాదనే అభిప్రాయంతో ప్రభుత్వం కొత్త జెడ్పీల ఏర్పాటు దిశగా అడుగులు వేస్తోంది. తొలుత ఏపీ లో సైతం తెలంగాణలో అనుసరించిన విధానాన్నే అమలు చేయాలని భావించారు.

న్యాయ సలహా తరువాత ముందుకు
అక్కడ జిల్లాల పునర్విభజన తర్వాత కూడా అప్పటికే ఉన్న జెడ్పీ చైర్మన్లే పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కొనసాగారు. 10 జిల్లాలుగా ఉండే తెలంగాణ రాష్ట్రం జిల్లాల పునర్విభజన తర్వాత 33 జిల్లాలుగా మారిపోయింది. 2014లో ఉమ్మడి జిల్లాల వారీగా ఎన్నికైన జెడ్పీ చైర్మన్లే 2019లో వారి పూర్తి పదవీ కాలం ముగిసే వరకు ఆయా పదవుల్లో కంటిన్యూ అయ్యారు.
జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం అప్పటికి మరో రెండేళ్లు మాత్రమే మిగిలి ఉండడం వల్ల కూడా జెడ్పీల విభజన జోలికి పోలేదని అప్పట్లో తెలంగాణ ప్రభుత్వం వెళ్లలేదని భావిస్తున్నారు. ఏపీలో జిల్లాల పునర్విభజన తర్వాత కూడా 26 జిల్లాల ప్రాతిపదికన జెడ్పీలను విభజిస్తే అన్ని చోట్ల అధికార పార్టీకి స్పష్టమైన మెజార్టీ ఉందనే విషయాన్ని గమనించాలని పలువురు స్పష్టం చేస్తున్నారు.

ఎంపిక ప్రక్రియలో కీలకంగా
ఈ దృష్ట్యా కొత్త జిల్లాల ప్రాతిపదికన జెడ్పీ చైర్మన్ల ఎన్నిక నిర్వహణకే ప్రభుత్వం సుముఖంగా ఉన్నట్టు చర్చ జరుగుతోంది. ప్రస్తుత జెడ్పీ చైర్మన్ల పదవీ కాలం మధ్యలో కొత్త జిల్లాల వారీగా జెడ్పీల విభజన ప్రక్రియలో న్యాయ పరమైన చిక్కులు ఏమైనా ఉన్నాయా.. అని నిర్ధారించుకోవడానికి పంచాయతీ రాజ్ శాఖ న్యాయ సలహాలు తీసుకుంటోంది. ఇప్పటికే ఆ శాఖ ఉన్నతాధికారులు రాష్ట్ర అడ్వొకేట్ జనరల్‌కు లేఖ రాశారు. అక్కడ నుంచి అభిప్రాయం రాగానే... ఉగాది నాటికి కొత్త జిల్లాలు ప్రారంభమైన వెంటనే కొత్త జిల్లాలకు కొత్త జెడ్పీ ఛైర్మన్లను నియమించే ప్రక్రియ కు రంగం సిద్దం చేస్తున్నారు.

వారికే అవకాశం దక్కుతుందా
అయితే, వివాదాలకు తావు లేకుండా.. ప్రస్తుతం ప్రతీ జిల్లాలోనూ ఇద్దరేసి వైస్ ఛైర్మన్లు ఉండటంతో వారిలో కొత్త జిల్లా పరిధిలో జెడ్పీటీసీగా ఉంటే వారికి తొలి ప్రాధాన్యత ఇవ్వాలని .. లేని పక్షంలో మరొరకి వైపు చూసే అవకాశం ఉందని తెలుస్తోంది. ఇదే సమయంలో న్యాయ పరంగా సలహా తీసుకుంటూనే..కొత్త జిల్లాల జెడ్పీ ఛైర్మన్ల నియామకంలో సామాజిక సమతూకం పాటించే విధంగా నిర్ణయం ప్రకటించే అవకాశం ఉంది. దీంతో..నూతన జిల్లాలకు కొత్త జెడ్పీ ఛైర్మన్ల పదవుల కోసం మరోసారి వైసీపీలో పోటీ మొదలు కానుంది. మరి.. సీఎం జగన్ ఈ విషయంలో తుది నిర్ణయం ఏ విధంగా తీసుకుంటారనేది ఇప్పుడు ఆసక్తి కరంగా మారుతోంది.












Click it and Unblock the Notifications