లోక్ సభకు ముందస్తు - ఏపీ అసెంబ్లీకి, సీఎం జగన్ లెక్క పక్కా..!?
షెడ్యూల్ కంటే ముందస్తు ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఈ ఏడాది తెలంగాణతో సహా అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. కేంద్రంలో మారుతున్న సమీకరణాలతో ముందస్తుగానే లోక్ సభకు వెళ్లే ఆలోచన చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇదే సమయంలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలకు ముందస్తు పైన చర్చ మొదలైంది. ఏపీలో పొత్తుల దిశగా ప్రతిపక్షాలు సిద్దం అవుతున్న వేళ.. సీఎం జగన్ వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. దీంతో..ఏపీలో ఎన్నికలు ఎప్పుడు..ఏం జరుగుతందనేది ఆసక్తి కరంగా మారుతోంది.
ముందస్తు వైపు అడుగులు:కర్ణాటక ఎన్నికల తరువాత కేంద్రంలోని బీజేపీ ముఖ్య నేతల ఆలోచనల్లో మార్పు కనిపిస్తోంది. షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏడాది ఏప్రిల్ లో లోక్ సభ ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ముందస్తుగానే ఎన్నికలకు వెళ్లే విధంగా ఆలోచన జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఈ ఏడాది తెలంగాణతో సహా చత్తీస్‌గడ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్,మిజోరాం రాష్ట్రాల అసెంబ్లీకి ఎన్నికలు జరగనున్నాయి. కర్ణాటక ఎన్నికల్లో ఓటమి పాలైన బీజేపీ ఈ ఎన్నికలను సెమీస్ గా భావిస్తోంది. వీటిలో ఫలితాలు ఎక్కడైనా ప్రతికూలంగా ఉంటే ఖచ్చితంగా లోక్ సభ ఎన్నికల పైన ప్రభావం పడుతోందని అంచనా వేస్తోంది. ఈ సమయంలో నాలుగు నెలల ముందుగానే ఎన్నికలకు వెళ్లే అంశం పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది.

తెలుగు రాష్ట్రాలోనూ ఎన్నికలు:జాతీయ స్థాయిలో ప్రధాని మోదీకి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు ఏకం అవుతున్నాయి. వారందరూ ఒక్కటై బీజేపీకి ఓడించాలని ప్రతయ్నాలు ప్రారంభించాయి. అయిదు రాష్ట్రాల ఎన్నికల్లోనూ ఐక్యత ప్రదర్శిచేందుకు సిద్దం అవుతున్నాయి. ఈ సమయంలో ప్రతిపక్ష పార్టీలను ఆత్మరక్షణలోకి నెట్టేలా ముందస్తు ఎన్నికలకు వెళ్లాలని బీజేపీ భావిస్తోంది. అయిదు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ తో పాటే జరిగితే జాతీయ స్థాయిలో మోదీ నాయకత్వం పైన ఉన్న అనుకూలత ఒకే సారి ఓటింగ్ జరిగే సమయంలో అసెంబ్లీ ఎన్నికల్లోనూ కలిసి వస్తుందని అంచనా వేస్తున్నారు. దీనికి సంబంధించి బీజేపీ పాలిత సీఎంలు, మద్దతుగా నిలుస్తున్న పార్టీ నేతలతో బీజేపీ నాయకత్వం మంతనాలు చేస్తున్నట్లు సమాచారం. బీఆర్ఎస్ జాతీయ పార్టీగా రూపాంతరం చెందటంతో అసెంబ్లీతో పాటుగా పార్లమెంట్ ఎన్నికలు ఆ పార్టీకి ఏ కలిసి వస్తాయనే చర్చ బీఆర్ఎస్ వర్గాల్లో మొదలైంది.
సీఎం జగన్ వ్యూహాత్మకంగా:ఇక, ఏపీలో షెడ్యూల్ ప్రకారం వచ్చే ఏప్రిల్ లో పార్లమెంట్ ఎన్నికలతో పాటుగా అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. కానీ, ఏపీలో విపక్షాల పొత్తల లెక్కల్లో బిజీగా ఉన్నాయి. ముందస్తు ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నా ఆ దిశగా కసరత్తు వేగవంతం కాలేదు. ఇదే తమకు అనువైన సమయంగా సీఎం జగన్ భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. కేంద్రం అంచనా వేస్తున్నట్లుగా పార్లమెంట్ కు ముందస్తుగా ఎన్నికలకు వెళ్తే..సీఎం జగన్ వాటితో పాటే ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు వెళ్లే అవకాశం ఉందని తెలుస్తోంది. పొత్తుల కారణంగా పార్టీల మధ్య సహజంగానే ఎన్నికల సమయంలో క్షేత్ర స్థాయిలో ఏర్పడే ఇబ్బందులను తమకు అనుకూలంగా మలచుకోవాలనేది వైసీపీ అంచనాగా కనిపిస్తోంది. అయితే, హౌసింగ్ స్కీం, పెండింగ్ హామీలు పూర్తి చేస్తూ..పోలవరం ఒక దశకు తీసుకొచ్చేలా కార్యాచరణ సిద్దం అవుతోంది. ప్రతిపక్షాలపై పై చేయి సాధించేలా ఎన్నికల నిర్వహణ పైన సీఎం జగన్ నిర్ణయం ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు.












Click it and Unblock the Notifications