హైదరాబాద్-విజయవాడ ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్..!
హైదరాబాద్ నుంచి విజయవాడకు రోడ్డు మార్గాన వెళ్లే ప్రయాణికులకు కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. తెలంగాణకు మాత్రమే రాజధానిగా మారిన హైదరాబాద్ నుంచి ఏపీ రాజధాని అమరావతికి వెళ్లాలంటే కీలకమైన హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా విస్తరించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకున్నా అమలులో తీవ్ర జాప్యం జరిగింది. ఇప్పుడు వివాదాలన్నీ పరిష్కరించిన కేంద్రం.. రోడ్డు విస్తరణ పనులకు పచ్చజెండా ఊపింది.
హైదరాబాద్ నుంచి విజయవాడ మధ్య చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం నుంచి ఏపీలోని నందిగామ వరకూ ఉన్న 181.50 కిలోమీటర్ల రహదారిని 2010లో ఆరు లైన్లుగా విస్తరించేందుకు జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ (NHAI) జీఎమ్మార్ సంస్థకు బాధ్యతలు అప్పజెప్పింది. కానీ 181.50 కిలోమీటర్ల రోడ్డును రూ.1740 కోట్లతో నాలుగు లైన్లుగా మార్చిన జీఎమ్మార్ 2012 నుంచి పంతంగి, కొర్లపహాడ్, చిల్లకల్లు టోల్ ప్లాజాల ద్వారా టోల్ వసూలు చేసుకుంటోంది. ఇలా 2025 జూన్ వరకూ వసూలు చేసుకునేందుకు జీఎమ్మార్ కు గడువు ఉంది. కానీ మధ్యలో దీన్ని ఆరులైన్లుగా మార్చే ప్రతిపాదన వచ్చింది.

కానీ 2014లో రాష్ట్ర విభజన కారణంగా తాము నష్టపోయామంటూ జీఎమ్మార్ హైదరాబాద్-విజయవాడ జాతీయ రహదారిని ఆరు లైన్లుగా మార్చకుండా కోర్టును ఆశ్రయించింది. ముఖ్యంగా అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ ప్రాంతం నుంచి ఆంధ్రాకు ఇసుక లారీల రాకపోకల కారణంగా రోజుకు రూ.20 లక్షల చొప్పున నెలకు రూ.6 కోట్లు టోల్ వసూలు చేసుకున్న జీఎమ్మార్ .. రాష్ట్ర విభజనతో దీన్ని నష్టపోయినట్లు కోర్టుకు తెలిపింది. అప్పటి నుంచీ కోర్టులో ఉన్న ఈ వ్యవహారంలో జీఎమ్మార్-జాతీయ రహదారుల సంస్థ పలు దఫాలు చర్చలు జరిపాయి.
చివరికి గడువు ఉన్న 2025 కంటే ముందే ఇప్పుడే నష్టపరిహారం తీసుకుని టోల్ నుంచి తప్పుకునేందుకు జీఎంఆర్ అంగీకరించింది. దీంతో వచ్చే మూడు నెలల పాటు టోల్ వసూలు కోసం మరో రెండు సంస్థలకు బాధ్యతలు అప్పగించారు. అదే సమయంలో ఆరు లైన్ల రహదారి విస్తరణకు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూడు నెలల్లో NHAI కొత్త కాంట్రాక్టర్ ను ఎంపిక చేసి ఆరు లైన్ల విస్తరణ పనులు, టోల్ గేట్ బాధ్యతలను కట్టబెట్టబోతోంది. ఈ లెక్కన హైదరాబాద్- విజయవాడ రోడ్డు ఆరు లైన్లుగా మారితే ప్రయాణ సమయం తగ్గడంతో పాటు ప్రమాదాలు కూడా తగ్గనున్నాయి.












Click it and Unblock the Notifications