నిడదవోలులో ఆ ఎక్స్ ప్రెస్ కు హాల్ట్ మొదలు..! జెండా ఊపిన పురందేశ్వరి..!
తూర్పుగోదావరి జిల్లా పరిధిలోని నిడదవోలు (Nidadavolu) రైల్వే జంక్షన్ ఈ ప్రాంతానికి చాలా కీలకమైంది. అయినా ఇక్కడ గతంలో చాలా ఎక్స్ ప్రెస్ రైళ్లకు హాల్ట్ లు ఉండేవి కావు. అయితే రాజమండ్రి ఎంపీ అయిన తర్వాత బీజేపీ నేత పురందేశ్వరి.. కేంద్రంతో లాబీయింగ్ చేయడం ప్రారంభించాక ఒక్కో రైలుకు నిడదవోలు స్టేషన్లో స్టాప్ లు లభిస్తున్నాయి. ఇదే క్రమంలో తాజాగా విశాఖపట్నం-లోక మాన్య తిలక్ ఎక్స్ ప్రెస్ రైలుకు కూడా ఇక్కడ స్టాప్ లభించింది.
ఇవాళ ఈ హాల్ట్ ను ఎంపీ దగ్గుబాటి పురందేశ్వరి, రాష్ట్రమంత్రి కందుల దుర్గేష్ లాంఛనంగా ప్రారంభించారు. ఈ సందర్భంగా నిడదవోలు రైల్వే స్టేషన్‌లో విశాఖపట్నం - ముంబై లోకమాన్య తిలక్ టెర్మినల్ (LTT) ఎక్స్‌ప్రెస్‌కు హాల్ట్ సౌకర్యం కల్పించడం ఎంతో సంతోషకరమని ఆమె ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా నిడదవోలు రైల్వే స్టేషన్‌లో రాష్ట్ర మంత్రి కందుల దుర్గేష్ తో కలిసి జెండా ఊపి రైలును నిడదవోలు స్టేషన్ నుండి ప్రారంభించినట్లు ఆమె తెలిపారు.

ఈ హాల్ట్‌తో నిడదవోలు, పరిసర ప్రాంతాల ప్రజలకు ముంబై,హైదరాబాద్, విజయవాడ,విశాఖపట్నం సహా ముఖ్య నగరాలకు రాకపోకలు మరింత సులభతరం కానున్నాయని పురందేశ్వరి తెలిపారు. నిడదవోలు ప్రజల చిరకాల ఆకాంక్షను నెరవేర్చిన కేంద్ర ప్రభుత్వానికి, భారతీయ రైల్వేలకు ఆమె హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. నిడదవోలులో ఈ కీలకమైన ఎక్స్ ప్రెస్ రైలుకు హాల్ట్ లభించడంతో షిర్డీతో పాటు మహారాష్ట్రలోని పలు ప్రాంతాలకు వెళ్లే వారికి ఉపయోగకరంగా ఉంటుందని భావిస్తున్నారు.














Click it and Unblock the Notifications