దేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలు... సైకిల్ పై వెళ్లిపోవచ్చు
భారతీయ రైల్వే రోజురోజుకు అత్యాధునిక సాంకేతికతను సంతరించుకుంటోంది. అత్యంత వేగంగా నడిచే వందేభారత్ రైళ్లను ప్రవేశపెట్టింది. సెమీ హైస్పీడ్ రైళ్లుగా ఇవి పేరు తెచ్చుకున్నాయి. వచ్చే ఏడాది బుల్లెట్ రైలు పట్టాలెక్కబోతోంది. ఇంతవ వేగంగా రైల్వే అభివృద్ధి సాధిస్తున్న తరుణంలో కూడా అత్యంత నెమ్మదిగా నడిచే రైలు ఒకటి మనదేశంలోనే ఉంది. 46 కిలోమీటర్లు ప్రయాణించడానికి దీనికి పట్టే సమయం ఐదు గంటలు. అయితే ఈ ఐదుగంటలు మీరు ప్రయాణం చేసినా మీకు ఎక్కడా చికాకు అనిపించదు. ప్రయాణాన్ని ఆస్వాదిస్తారు. అదే ఆ ప్రయాణ గొప్పదనం.
మొదట్లో ఎద్దుల బండిపై వెళ్లేవారు
ప్రముఖ పర్యాటక కేంద్రంగా గుర్తింపు తెచ్చుకున్న తమిళనాడులోని నీలగిరి మార్గంలో ఈ రైలు ప్రయాణిస్తుంది. మెట్టుపాళ్యం నుంచి ఊటీ వరకు ఉండే అద్భుతమైన ప్రకృతి సౌందర్యాలను ఆస్వాదించాలనుకునేవారికి ఈ రైలు ప్రయాణం జీవితంలో మరిచిపోలేని అనుభూతిని కలిగిస్తుంది. ఆసియా ఖండంలో ర్యాక్, పినియన్ ట్రాక్స్ పై నడిచే ఏకైక రైలు ఇదే. 16 సొరంగాలు, 250 వంతెనలను దాటుతూ ఈ ప్రయాణం సాగుతుంది. బ్రిటీష్ వారు మనదేశాన్ని పరిపాలించిన సమయంలో ఊటీకి ఎద్దుల బండిపై వెళ్లేవారు. తర్వాత 1890లో కూనూరు వరకు ర్యాక్, పినియన్ ట్రాక్ ఏర్పాటు చేసి ఆవిరితో నడిచే రైలులో ప్రయాణించేవారు. 125 సంవత్సరాలుగా ఈ ప్రయాణం ఇలాగే కొనసాగుతోంది.

గంటకు 9 కిలోమీటర్ల వేగం
భారతదేశంలో అత్యంత నెమ్మదిగా నడిచే రైలుగా నీలగిరి మౌంటెన్ రైలు పేరు తెచ్చుకుంది. గంటకు తొమ్మిది కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తుంది. తిరుగు ప్రయాణం మాత్రం మూడున్నర గంటల్లో పూర్తవుతుంది. మణిరత్నం దర్శకత్వంలో షారుక్ ఖాన్ హీరోగా రూపొందిన దిల్ సే చిత్రంలోని చయ్య చయ్యా పాటను ఈ రైల్లోనే తీశారు. జీవితంలో ఒకసారైనా ఈ రైలులో ప్రయాణం చేయాలని ప్రతి పర్యాటకుడు కలలు కంటుంటారు. ఏడాదికి కొన్ని లక్షల మంది ఇక్కడకు వస్తుంటారు. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచే కాకుండా ప్రపంచంలోని ఇతర దేశాల నుంచి కూడా ప్రయాణికులు వస్తుంటారు.












Click it and Unblock the Notifications