జగన్ సర్కార్ పై నిర్మల పరోక్ష వ్యాఖ్యలు-టార్గెట్ ఉచితాలు, అప్పులు-సుపరిపాలన అంటే ఇదీ..
ఏపీలో వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న సంక్షేమ మోడల్, అప్పులపై గతంలో పలుమార్లు ఆగ్రహం వ్యక్తంచేసిన కేంద్ర ఆర్ధికమంత్రి నిర్మలా సీతారామన్ తాజాగా ఏపీ టూర్ లోనూ కీలక వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా ప్రభుత్వం పేరెత్తకుండానే ఉచిత పథకాలతో మొదలుపెట్టి, అప్పులు, సుపరిపాలన వరకూ పలు అంశాలపై ఆమె జగన్ సర్కార్ ను టార్గెట్ చేశారు. అసలే అప్పుల కోసం, కేంద్ర రుణాల కోసం నిర్మలపై ఆధారపడుతున్న వైసీపీ సర్కార్ ఇప్పుడు ఆమె వ్యాఖ్యలతో మరోసారి ఆత్మరక్షణలో పడింది.

నిర్మలా సీతారామన్ కామెంట్స్
దివంగత ముఖ్యమంత్రి ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల సందర్భంగా విశాఖపట్నంలోని గీతం యూనివర్శిటీలో ఆయన కుమార్తె, బీజేపీ నేత దగ్గుబాటి పురంధేశ్వరి ఏర్పాటు చేసిన ఓ కార్యక్రమానికి కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ ముఖ్య అతిధిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా నిర్మల సంక్షేమం-సుపరిపాలన అంశంపై తనదైన శైలిలో వ్యాఖ్యలు చేశారు. ముఖ్యంగా వైసీపీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలను ఆమె టార్గెట్ చేశారు. ప్రభుత్వం అప్పులు తెచ్చి సంక్షేమాన్ని అమలు చేస్తున్న తీరుపై నిర్మల పరోక్ష విమర్శలు చేశారు.

పథకాలు అర్హులకివ్వడమే సుపరిపాలన
ప్రస్తుతం దేశంలో ఎన్నో పథకాలు అమలవుతున్నాయని, కానీ వాటిని అర్హులకు మాత్రమే అందించడం సుపరిపాలన అవుతుందని కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. సంసద్ ఆదర్శ గ్రామ యోజన కింద ప్రతీ ఎంపీ రెండు గ్రామాల్ని దత్తత తీసుకుని అభివృద్ది చేయాలని కేంద్రం సూచించిందని, ఎలాంటి అదనపు నిధులు కేటాయించకుండానే ఉన్నపథకాలనే వారికి వర్తింపచేసి అభివృద్ధి అంటే ఎంటో చూపించామని నిర్మల తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం పథకాల కోసం కొత్తగా వేల కోట్ల అప్పులు తీసుకొచ్చి ఖర్చు చేస్తున్న నేపథ్యంలో నిర్మల వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.

ఉచితాలపై చర్చ జరగాల్సిందే !
దేశంలో ప్రస్తుతం ప్రభుత్వాలు ప్రజలకు విచ్చలవిడిగా ఉచిత పథకాలు అందిస్తున్నాయని, వాటిని అందించడం సహేతుకమా కాదా అనే దానిపై విస్తృతంగా చర్చ జరగాలన్నారు. అవన్నీ అసెంబ్లీలో ప్రజాప్రతినిధులకు తెలిసే జరుగుతున్నాయా లేదా అనేది కూడా చర్చించాలన్నారు. అలాగే ప్రజలకు కూడా వాటి వివరాలు చెబుతున్నారా లేదా అన్నది చర్చకు పెట్టాలని నిర్మల సూచించారు. మరోవైపు కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు వడ్డీలు కట్టడానికి అప్పులు చేస్తున్నాయని, ఇది మంచి విధానం కాదని జగన్ సర్కార్ ను ఉద్దేశించి నిర్మలా సీతారామన్ పరోక్ష వ్యాఖ్యలు చేశారు.