తుఫాన్‌పై జగన్‌కు మాట్లాడే అర్హత లేదు: మంత్రి గొట్టిపాటి కౌంటర్!
Minister Gottipati Ravikumar: మొంథా తుఫాను కారణంగా రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థకు జరిగిన నష్టాన్ని, దానిని పునరుద్ధరించడానికి తమ శాఖ తీసుకున్న వేగవంతమైన చర్యలను రాష్ట్ర విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ వివరించారు. సీఎం ఆదేశాల మేరకు తుఫాన్ రాకకు రెండు రోజుల ముందే విద్యుత్ శాఖ అప్రమత్తమై.. సుమారు 1500 మంది సిబ్బందిని ప్రభావిత ప్రాంతాలకు మోహరించింది. ఏ ఒక్కరికీ ప్రాణ నష్టం జరగకూడదనే లక్ష్యంతో తమ ప్రభుత్వం పనిచేసిందని మంత్రి స్పష్టం చేశారు. బలమైన గాలుల కారణంగా ప్రజల భద్రత కోసం ముందుగానే కొన్ని చోట్ల పవర్ షట్ డౌన్ చేయాల్సి వచ్చిందని తెలిపారు. సిబ్బంది తమ ప్రాణాలను పణంగా పెట్టి నిర్విరామంగా పనిచేయడం వల్లే నష్టం జరిగిన 24 గంటల్లోనే చాలావరకు విద్యుత్ వ్యవస్థను పునరుద్ధరించగలిగామని చెబుతూ, వారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేశారు.
మాజీ ముఖ్యమంత్రిపై తీవ్ర విమర్శలు
తుఫాన్‌పై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి చేసిన వ్యాఖ్యలను మంత్రి గొట్టిపాటి రవికుమార్ తీవ్రంగా ఖండించారు. గతంలో జగన్ రెడ్డి విపత్తు పరిశీలన అంటే 'రెడ్ కార్పెట్ వేసుకుని తిరిగిన' వ్యక్తి అని ఎద్దేవా చేశారు. విపత్తు నిర్వహణపై ఆయనకు మాట్లాడే అర్హత లేదని విమర్శిస్తూ.. "తుఫాను వల్ల పెద్ద ఎత్తున ప్రాణ నష్టం జరగలేదన్నది జగన్ బాదేమో" అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. తాము ప్రజల ప్రాణాలను కాపాడే లక్ష్యంతో పారదర్శకంగా, వేగవంతంగా పని చేశామని మంత్రి ఉద్ఘాటించారు.

విద్యుత్ వ్యవస్థకు భారీ నష్టం.. వేగంగా పునరుద్ధరణ
మొంథా తుఫాన్ వల్ల రాష్ట్రంలో విద్యుత్ వ్యవస్థకు భారీగా నష్టం వాటిల్లింది. మంత్రి వెల్లడించిన ప్రకారం.. దాదాపు 13,000 విద్యుత్ స్తంభాలు నేలకూలాయి, సుమారు 3,000 కిలోమీటర్ల మేర కండక్టర్ (వైరు) దెబ్బతింది, అలాగే 3,000 ట్రాన్స్ఫార్మర్‌లు కూడా తుఫాను ధాటికి ప్రభావితమయ్యాయి. ఈ స్థాయిలో నష్టం జరిగినా, విద్యుత్ సిబ్బంది అలుపులేని కృషి వల్లే ప్రధాన వ్యవస్థ 24 గంటల్లో పునరుద్ధరణ అయింది. వ్యవసాయం, ఆక్వా రంగాలకు సంబంధించి వాలిపోయిన విద్యుత్ స్తంభాలను మరో 48 గంటల్లో పూర్తి స్థాయిలో పునరుద్ధరిస్తామని మంత్రి ఈ సందర్భంగా హామీ ఇచ్చారు.












Click it and Unblock the Notifications