హైకోర్టు చెప్తే: కెసిఆర్ ఆస్తుల కేసుపై సిబిఐ, కోర్టుకి కెవిపి
న్యూఢిల్లీ: తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షులు కల్వకుంట్ల చంద్రశేఖర రావు, ఆ పార్టీ సీనియర్ నేత హరీష్ రావు, కాంగ్రెసు పార్టీ నేత విజయశాంతిల పైన ఎలాంటి కేసు నమోదు చేయలేదని సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) చెప్పినట్లుగా తెలుస్తోంది. హైదరాబాదు నుండి ఇందుకు సంబంధించి వివరాలు అందాయని తెలిపింది.
హైకోర్టు, సుప్రీం కోర్టు ఆదేశిస్తేనే కేసు నమోదు చేస్తామని సిబిఐ తెలిపిందని సమాచారం. సిబిఐ కోర్టు ఆదేశాలు జారీ చేస్తే కేసులు నమోదు చేయలేమని, ఇదే విషయాన్ని తాము హైకోర్టుకు విన్నవిస్తామని, హైకోర్టు ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామని సిబిఐ చెప్పినట్లుగా సమాచారం.

కాగా, సార్వత్రిక ఎన్నికల సమయంలో కల్వకుంట్ల చంద్రశేఖర రావుకు షాక్ తగిలిన విషయం తెలిసిందే. కెసిఆర్ ఆస్తుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని సిబిఐ ప్రత్యేక కోర్టు సిబిఐని శుక్రవారం ఆదేశించింది. కెసిఆర్, తెరాస సీనియర్ నేత హరీష్ రావు, కాంగ్రెసు పార్టీ నాయకురాలు విజయశాంతిల ఆస్తుల పైన విచారణ జరపాలని సిబిఐ ప్రత్యేక కోర్టులో గురువారం ప్రయివేటు ఫిర్యాదు దాఖలైంది.
హైదరాబాదుకు చెందిన న్యాయవాది బాలాజీ వదేరా అనే వ్యక్తి ఈ పిటిషన్ దాఖలు చేశారు. బాలాజీ పిటిషన్‌ను సిబిఐ ప్రత్యేక న్యాయస్థానం స్వీకరించింది. అనంతరం కెసిఆర్, హరీష్ రావు, విజయశాంతిల ఆస్తుల పైన ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ జరపాలని ఆదేశాలు జారీ చేసింది.
2001కి ముందు తక్కువగా ఉన్న కెసిఆర్, విజయశాంతి, హరీష్ రావుల ఆస్తులు ఆ తర్వాత భారీగా పెరిగాయని బాలాజీ ఆరోపించారు. తెలంగాణ ఉద్యమం పేరుతో వారు గడించారనే ఆరోపణలు విపక్షాల నుండి వెల్లువెత్తుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో బాలాజీ పిటిషన్ దాఖలు చేశారు. వారి ముగ్గురు ఆస్తులపై విచారణ జరపాలని కోర్టు ఆదేశించింది.
కెవిపి పిటిషన్
కాంగ్రెసు పార్టీ సీనియర్ రాజ్యసభ సభ్యులు కెవిపి రామచంద్ర రావు శుక్రవారం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఇంటర్ పోల్ రెడ్ కార్నర్ నోటీసు పైన స్టే ఇవ్వాలని ఆయన పిటిషన్ దాఖలు చేశారు.












Click it and Unblock the Notifications