డబ్బుల్లేవ్, పెళ్లి రద్దు చేసుకోండి: మహిళతో మేనేజర్, ప్రజల ఆగ్రహం
పాణ్యం స్టేట్ బ్యాంక్ వద్ద శుక్రవారం జయమ్మ అనే మహిళ తీవ్ర ఆవేదనకు గురైంది. తమ కుమారుడి వివాహ ఖర్చుల కోసం డబ్బుల అవసరం ఉండి బ్యాంకుకు వచ్చిన ఆమెకు.. బ్యాంకు అధికారుల స్పందన ఆమెను నిట్టూర్చేలా చేసింది
కర్నూలు: పెద్ద నోట్ల రద్దుతో తగిన డబ్బు లేకపోవడంతో ఇప్పటికే పలువురు తమ వివాహాలను వాయిదా వేసుకుంటుండగా, మరికొందరు ఉన్నదాంట్లోనే పరిమితంగా ఖర్చులు చేసుకుంటూ ఒడ్డెక్కిస్తున్నారు. మరికొందరు మధ్య తరగతి ప్రజలు తమ దగ్గర డబ్బులు లేక, బ్యాంకుల నుంచి డబ్బులు అందక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ఈ క్రమంలో పలువురు తమ ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు.
కాగా, తాజాగా పాణ్యం స్టేట్ బ్యాంక్ వద్ద శుక్రవారం జయమ్మ అనే మహిళ తీవ్ర ఆవేదనకు గురైంది. తమ కుమారుడి వివాహ ఖర్చుల కోసం డబ్బుల అవసరం ఉండి బ్యాంకుకు వచ్చిన ఆమెకు.. బ్యాంకు అధికారుల స్పందన ఆమెను నిట్టూర్చేలా చేసింది.
జయమమ్మ కుమారుడు సుబ్బక్రిష్ణ పెళ్ళి డిసెంబర్ 9వ తేదీన జరగాల్సి ఉంది. కాగా, పెళ్ళి ఖర్చులకై రూ.80 వేల కోసం 15 రోజులుగా బ్యాంక్ చుట్టూ తిరుగుతున్నా.. నగదు లేదంటూ తిప్పుతున్నారని పేర్కొంది. గురువారం రూ.26 వేలు ఇచ్చారని మిగిలిన నగదు కోసం వెళ్తే బ్రాంచి మేనేజర్.. పెళ్ళి రద్దు చేసుకోమంటూ సలహానిచ్చాడని కంటతడిపెట్టింది జయమ్మ.

ఇప్పటికిప్పుడు పెళ్ళి నిలిచిపోతే తమ పరువు పోతుందని బాధ పడింది. ఈ క్రమంలో బ్యాంకు వద్ద ఉద్యోగులు, పెన్షనర్లు బ్రాంచి మేనేజర్ తిక్కన్నతో వాగ్వివాదానికి దిగారు. నగదు లేనప్పుడు బ్యాంక్ మూసుకోవాలంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
'పది రోజులుగా బ్యాంక్‌లో నగదు లేదు. బయటి నుంచి నగదు రావడం లేదు. నగదు బదిలీ చేస్తున్నాం. రెండు వేల నోట్లు సైతం డిపాజిట్ కావడం లేదు. ఏటీఎంలో ఇప్పటి వరకు రూ.15 లక్షలు నిల్వ చేయగా అయిపోయాయి. మెయిన్ బ్రాంచి నుంచి నగదు అందాల్సి ఉంది. మేం ఏమి చేయలేం' అని బ్యాంక్ మేనేజర్ తిక్కన్న తెలిపారు.












Click it and Unblock the Notifications