పొరపాటు జరిగితే..: ఢిల్లీకి కిరణ్ హెచ్చరిక, జగన్ పైనా

విభజన ద్వారా తెలంగాణ ప్రాంతానికే ఎక్కువ నష్టమన్నారు. విభజన జరిగితే తెలంగాణ 111 టిఎంసిల నీటిని కోల్పోతుందన్నారు. తద్వారా పదమూడు లక్షల ఎకరాల పంట బీడు భూమిగా మారుతుందని హెచ్చరించారు. రాష్ట్రం కలిసింటేనే అధిక నిధులను తెచ్చుకోవచ్చునని చెప్పారు.
రాష్ట్ర విభజన జరిగితే శ్రీశైలం, సాగర్ లాంటి ప్రాజెక్టులను నిర్మించుకోలేమని చెప్పారు. తెలంగాణ రైతులు నష్టపోయే ప్రమాదముందన్నారు. కేంద్రం విభజన ద్వారా ఆటంబాంబులాంటి నిర్ణయం తీసుకుందని, దానిని ఎట్టి పరిస్థితుల్లోను వెనక్కి తీసుకోవాల్సిందే అన్నారు.
సమైక్యాంధ్ర కోసం శక్తివంచన లేకుండా కృషి చేస్తానని, తానొక్కడినే సమైక్యం కోరుకోవడం లేదని, ప్రజలంతా అదే కోరుకుంటున్నారని చెప్పారు. ప్రభుత్వ పథకాల గురించి చెబుతూ.. దేశంలోనే తొలిసారిగా ఎస్సీ, ఎస్టీల ఉప ప్రణాళికను రాష్ట్రంలో అమలు చేస్తున్నామన్నారు. బంగారు తల్లి పథకం కింద ఇప్పటి వరకు 93వేల మంది పేర్లు నమోదు చేసుకున్నారన్నారు.
చిత్తూరు జిల్లా వి.కోట రచ్చబండలో..
విభజన వల్ల పొరపాటు జరిగితే తెలుగు జాతి నష్టపోతుందని, ఉద్యోగులు ఇబ్బంది పడతారని చిత్తూరు జిల్లా వి.కోట రచ్చబండ కార్యక్రమంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి అన్నారు. విభజనతో 2.5 లక్షల మంది ఉద్యోగులు బదలీ, ప్రమోషన్ సమస్యలు ఎదుర్కొంటారన్నారు. ఆర్టికల్ 3 ప్రకారం విభజించమని చెప్పిన వైయస్ జగన్ ఇప్పుడు సమైక్యమంటూ ప్రజల ముందుకు వెళ్తున్నారని ఆరోపించారు.
విభజనపై కేంద్రం పునరాలోచన చేయాలని సూచించారు. పొరపాటు జరిగితే శాశ్వతంగా రాష్ట్రానికి నష్టం జరుగుతుందని హెచ్చరించారు. విభజన వల్ల తెలంగాణకు ఎక్కువ నష్టమన్నారు. తెలంగాణలో లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులు పూర్తయితే మిగులు జలాల విషయంలో తెలంగాణ నష్టపోతుందన్నారు. సమైక్యంగా ఉంటేనే మిగులు జలాలు వాడుకోవచ్చునన్నారు.












Click it and Unblock the Notifications