ఏపీలో నేటి నుంచి పగటి కర్ఫ్యూ ఎత్తివేత-బస్సులు, బ్యాంకులు, ఆఫీసులు యథాతథం
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో నేటి నుంచి పగటి పూట కర్ఫ్యూ తొలగిపోనుంది. ప్రభుత్వం ఇప్పటికే దీనిపై నిర్ణయం తీసుకుంది. అలాగే కర్ఫ్యూ సడలింపుతో ఆర్టీసీ బస్సులు యథావిధిగా నడవబోతున్నాయి. బ్యాంకులు, ప్రభుత్వ కార్యాలయాలు సాధారణంగా పనిచేయనున్నాయి. ఒక్క తూర్పుగోదావరి మినహా మిగిలిన అన్ని జిల్లాల్లో జనజీవనం సాధారణ స్ధితికి చేరబోతోంది. ఈ నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ఏపీలో జరిగే మార్పులేంటో ఓసారి చూద్దాం...

పగటి పూట కర్ప్యూ ఎత్తివేత
ఏపీలో కరోనా కేసులు క్రమంగా తగ్గుముఖం పడుతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆదేశాల మేరకు ఇవాళ్టి నుంచి పగటి పూట కర్ఫ్యూని ఎత్తేశారు. దీంతో ఉదయం 6 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ కర్ఫ్యూ ఉండదు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో తూర్పుగోదావరి జిల్లా మినహా మిగిలిన జిల్లాల్లో ఇక పగటి పూట కర్ఫ్యూ ఉండదు. ఇవాళ్టి నుంచి అమల్లోకి వచ్చే ఈ సడలింపులు ఈ నెల 30 వరకూ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. అప్పటివరకూ పరిస్ధితుల్లో ఎలాంటి మార్పూ లేకపోతే ఈ సడలింపులు కొనసాగుతాయి. లేకుంటే వచ్చే నెల 1వ తేదీ నుంచి కొత్త షెడ్యూల్ అమల్లోకి రానుంది.

ఆర్టీసీ సర్వీసులు యథాతథం
ఏపీలో కర్ఫ్యూ సడలింపులు అమల్లోకి వచ్చిన నేపథ్యంలో ఆర్టీసీ కూడా దూరప్రాంత సర్వీసులతో పాటు అంతర్ రాష్ట్ర బస్సు సర్వీసులను కూడా ఇవాళ్టి నుంచి పునరుద్ధరిస్తోంది. తెలంగాణ, కర్నాటక, తమిళనాడుతో పాటు ఇతర రాష్ట్రాలకు వెళ్లే సర్వీసుల్ని ఇవాళ్టి నుంచి దశల వారీగా పునరుద్ధరిస్తారు. అలాగే ఏపీలో జిల్లాల మధ్య నడిచే దూరప్రాంత సర్వీసులు కూడా అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు కరోనా కారణంగా బస్సులు తిరగకపోవడంతో పక్కనబెట్టిన టికెట్ల అడ్వాన్స్ రిజర్వేషన్ వ్యవస్ద కూడా ఇవాళ్టి నుంచి తిరిగి పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానుంది.

ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు యథాతథం
కర్ఫ్యూ సడలింపుల నేపథ్యంలో ఇవాళ్టి నుంచి ప్రభుత్వ కార్యాలయాలు యథావిధిగా పనిచేస్తాయని ప్రభుత్వం ప్రకటించింది. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకూ ఆఫీసులు పనిచేసేలా ఆ తర్వాత ఆరు గంటల కల్లా ఉద్యోగులు ఇళ్లకు చేరుకునేలా ఏర్పాటు చేశారు. అలాగే బ్యాంకుల పనివేళలూ మారబోతున్నాయి. ఇప్పటివరకూ కర్ఫ్యూ ఆంక్షలతో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకూ పనిచేసేన బ్యాంకులు ఇప్పుడు తిరిగి సాయంత్రం 4 గంటల వరకూ పనిచేయనున్నాయి. దీంతో పాటు బ్యాంకుల్లో సేవలు కూడా పూర్తిస్ధాయిలో అందుబాటులోకి రానున్నాయి.

తూర్పుగోదావరికి మాత్రం
రాష్ట్రవ్యాప్తంగా పగటి కర్ఫ్యూ ఎత్తేస్తున్నా తూర్పుగోదావరిలో మాత్రం కర్ఫ్యూ ఆంక్షలు కొనసాగనున్నాయి. ఇప్పటికీ రోజుకు వెయ్యికి పైగా కరోనా కేసులు నమోదవుతున్న తూర్పుగోదావరిలో కర్ఫ్యూ ఆంక్షలు మరికొన్ని రోజులు అమలు చేయక తప్పని పరిస్ధితి నెలకొంది. దీంతో జిల్లాలో ప్రభుత్వ కార్యాలయాలు, బ్యాంకులు, ఆర్టీసీ సర్వీసులు, ఇతర సేవలు కూడా పునరుద్ధరించేందుకు మరికొంత సమయం పట్టే అవకాశముంది. అయితే ఇప్పటికే అమల్లో ఉన్న మినహాయంపు సమయాలు మాత్రం ఈ నెల 30 వరకూ కొనసాగనున్నాయి. దీంతో తూర్పుగోదావరికి పొరుగు జిల్లాల నుంచి తిరిగే బస్సు సర్వీసులపై ఈ ప్రభావం పడబోతోంది.












Click it and Unblock the Notifications