దేవినేని ఉమకు హైకోర్టులో దక్కని ఊరట-బెయిల్ విచారణ ఆగస్టు 3కు వాయిదా
కొండపల్లి అడవుల్లో గ్రావెల్ మైనింగ్ పరిశీలనకు వెళ్లి అరెస్టైన టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమకు ఇవాళ హైకోర్టులో ఊరట దక్కలేదు. తనపై నమోదైన హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ సహా పలు కేసుల్లో బెయిల్ కోరుతూ ఉమ దాఖలు చేసుకున్న పిటిషన్ పై విచారణ వాయిదా పడింది.
బెయిల్ కోరుతూ టీడీపీ మాజీ మంత్రి దేవినేని ఉమ దాఖలు చేసిన పిటిషన్ ను విచారణకు స్వీకరించిన హైకోర్టు.. ఇవాళ వాదనలు కూడా ప్రారంభించింది. అయితే ఈ కేసులో ఉమను ఎలాగైనా రిమాండ్ లో ఉంచాలని భావించిన పోలీసులు.. స్టేషన్ రికార్డులను కోర్టుకు సమర్పించలేదు. దీంతో విచారణ వాయిదా వేయాలని కోర్టును వారు కోరారు. దీనిపై దేవినేని ఉమ తరఫు న్యాయవాది అభ్యంతరం తెలిపారు. 30 కిలోమీటర్ల దూరంలో ఉన్న స్టేషన్ నుంచి రికార్డులు వెంటనే తెప్పించాలని హైకోర్టు ధర్మాసనాన్ని కోరారు.

తనపై నమోదైన కేసుల రికార్డులను వెంటనే స్టేషన్ నుంచి తెప్పించాలన్న దేవినేని ఉమ లాయర్ తరఫు అభ్యర్ధనను హైకోర్టు అంగీకరించలేదు. ప్రభుత్వ వాదనతో ఏకీభవించిన హైకోర్టు ఈ పిటిషన్ పై విచారణను వచ్చే్ మంగళవారానికి అంటే ఆగస్టు 3వ తేదీకి వాయిదా వేసింది. రేపు, ఎల్లుండి హైకోర్టుకు వారాంతపు సెలవులు ఉండటం, సోమవారం అప్పటికే విచారణకు స్వీకరించిన పిటిషన్లు ఉండటంతో మంగళవారం దేవినేని ఉమ బెయిల్ పై హైకోర్టు విచారణ జరపనుంది. అప్పటివరకూ దేవినేని ఉమకు జైల్లోనే ఉండక తప్పదు.












Click it and Unblock the Notifications