ఏపీ సీపీఎస్ ఉద్యోగులకు షాక్
AP CPS employees: ఏపీ కంట్రిబ్యూటరీ పెన్షన్ ఉద్యోగుల అసోసియేషన్ ఆదివారం ఛలో విజయవాడ ఆందోళనను నిర్వహించబోతోన్న నేపథ్యంలో విజయవాడ పోలీసులు కీలక నిర్ణయాన్ని తీసుకున్నారు. ఈ ఆందోళనకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఈ మేరకు విజయవాడ నగర పోలీసులు ఓ ప్రకటన విడుదల చేశారు.
ఏపీ సీపీఎస్ ఉద్యోగ సంఘాలు నిర్వహించ తలపెట్టిన ఛలో విజయవాడ అనుమతులు లేవని పోలీసులు తెలిపారు. ఇటువంటి ఆందోళనలు, నిరసన కార్యక్రమాలకు స్థానిక పోలీస్ అధికారుల నుంచి గానీ ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు లేవని వివరించారు. ప్రస్తుతం నగరంలో 144 సెక్షన్ సీఆర్పీసీ, పోలీస్ యాక్ట్ సెక్షన్ 30 ప్రకారం నిషేధాజ్ఞలు అమలులో ఉన్నాయని గుర్తు చేశారు.

Recommended Video

ఈ నిషేధాజ్ఞలను ఉల్లంఘించిన వారిపై ఐసీసీ సెక్షన్లు, ప్రజా ఆస్తుల నష్ట నివారణ చట్టం (పీడీపీపీ) కింద కఠిన చర్యలను తీసుకుంటామని విజయవాడ పోలీసులు హెచ్చరించారు. ఏపీ కండక్ట్ రూల్స్ ప్రకారం శాఖాపరమైన చర్యలు సైతం ఉంటాయని తేల్చి చెప్పారు.
సీపీఎస్ ఉద్యోగుల ఆందోళన నేపథ్యంలో విజయవాడలో 1,500 మంది పోలీస్ సిబ్బందితో కట్టుదిట్టమైన భద్రతను ఏర్పాటు చేస్తామని చెప్పారు. అలాగే- సీసీటీవీలు, డ్రోన్ కెమెరాలు, వీడియోగ్రఫీతో పటిష్టమైన నిఘా ఉంచనున్నామని తెలిపారు. సీపీఎం ఉద్యోగులు, వారి మద్దతుదారులు ఛలో విజయవాడ ఆందోళనలో పాల్గొంటే చట్టపరమైన చర్యలను తీసుకుంటామని పేర్కొన్నారు.
సీపీఎస్‌కు బదులుగా జీపీఎస్ విధానాన్ని అమలు చేయడాన్ని నిరసిస్తూ ఉద్యోగులు రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమానికి సిద్ధమైన విషయం తెలిసిందే. ఇందులో భాగంగా ఓల్డ్ పెన్షన్‌ను విధానాన్ని అమలు చేయాలని డిమాండ్ చేస్తూ ఆదివారం ఛలో విజయవాడకు పిలుపునిచ్చారు.
మరోవంక ఏపీఎన్జీఓలు కూడా తమ డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభుత్వానికి ఈ నెల 26వ తేదీ వరకు గడువు ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ లోగా ప్రభుత్వం సానుకూల నిర్ణయాన్ని తీసుకోకపోతే తాము కూడా ఛలో విజయవాడ ఆందోళనను నిర్వహిస్తామని ఇదివరకే నిర్ణయించారు. వెంటనే ఐఆర్ ప్రకటించడం, బకాయిలు చెల్లించాలనేది వారి డిమాండ్.












Click it and Unblock the Notifications