బాబుతో తూగలేకే కేసీఆర్: లోకేష్, కుక్కలమా?: భట్టి
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ యువనేత నారా లోకేష్ మరోసారి ట్విట్టర్ వేదికగా చాలా రోజుల తర్వాత ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు పైన నారా లోకేష్ తన ట్వీట్‌లో విమర్శలు గుప్పించారు. అభివృద్ధిలో కేసీఆర్ ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు సాటిరారని పేర్కొన్నారు.
తెలంగాణలో విద్యుత్ లేదని, నీళ్లు సరిగా లేవని, ఉద్యోగాలు లేవని, రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారని పేర్కొన్నారు. అయితే, వీటన్నింటికీ కారణంగా చంద్రబాబును విమర్శిస్తున్నారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ అండ్ కో ఎప్పటికీ చంద్రబాబు చేసిన అభివృద్ధికి సాటి రారని, అందుకే వారు బ్లేమ్ గేమ్ ఆడుతున్నారని విమర్శించారు.
కర్నె ప్రభాకర్ ఆగ్రహం

ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ అబద్దాలకు పాఠశాలగా మారిందని తెరాస నేత కర్నె ప్రభాకర్ ధ్వజమెత్తారు. దానికి చంద్రబాబు ప్రిన్సిపల్ అని ఎద్దేవా చేశారు. తెరాసను విమర్శిస్తే టీడీపీ నేతలకు రాజకీయ సమాధే అన్నారు. టీటీడీపీ నేతలు ఏపీ అబివృద్ధి కోసం పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తెలంగాణలో విద్యుత్ కొరత అధిగమించేందుకు విద్యుత్ కొనుగోలు చేస్తామన్నారు.
తెలంగాణ టీడీపీ నేతలు చంద్రబాబుకు బానిసలుగా మారారని, ఇష్టమొచ్చినట్లుగా మాట్లాడితే కుదరదన్నారు. రేవంత్ రెడ్డి వంటి వారు పక్క రాష్ట్రానికి కోవర్టులుగా మారారని విమర్శించారు. విద్యుత్ కొరత పైన చంద్రబాబును ఎందుకు నిలదీయడం లేదని ప్రశ్నించారు. విభజన చట్టం ప్రకారం తెలంగాణకు 54 శాతం విద్యుత్ రావాలని, దాని కోసం చంద్రబాబును నిలదీయాలన్నారు.
కుక్కలమేనని మల్లుభట్టి
కేసీఆర్‌కు ప్రజాస్వామ్యం పైన నమ్మకం లేదని తెలంగాణ కాంగ్రెస్ నేత మల్లుభట్టి విక్రమార్క వేరుగా మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చాలని అడిగితే తమను కుక్కలతో పోల్చడమేమిటని ప్రశ్నించారు. నిజంగానే తాము తెలంగాణకు వాచ్ డాగ్‌లం అన్నారు.
మరోవైపు, రాష్ట్రీయ స్వయంసేవక సంఘ్ చీఫ్ మోహన్ భగవత్ ప్రసంగాన్ని దూరదర్శన్‌లో ప్రసారం చేయడాన్ని తెలంగాణ కాంగ్రెస్ నేత వి హనుమంత రావు తప్పుపట్టారు. డీడీలో భగవత్ ప్రసంగం సరికాదన్నారు. భారత దేశం ప్రజాస్వామ్య దేశమే కాని, హిందూ దేశం కాదన్నారు. ఉగ్రవాద సంస్థల ప్రసంగాలను కూడా ప్రసారం చేస్తారా అని నిలదీశారు.












Click it and Unblock the Notifications