మీకివ్వం: రేవంత్-మోత్కుపల్లిలకు లోకేష్ షాక్, బీజేపీ పైనా..
విజయవాడ: తెలంగాణ తెలుగుదేశం పార్టీ నేతలకు ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ నారా లోకేష్ బుధవారం నాడు షాకిచ్చారు. ఏపీ కోటా నుంచి తెలంగాణ ప్రాంత నాయకులకు రాజ్యసభ సీటు వచ్చే అవకాశం లేదని తేల్చి చెప్పారు. ఏపీలోనే తీవ్రమైన పోటీ ఉందని చెప్పారు.
రాజ్యసభ సీటు విషయంలో భారతీయ జనతా పార్టీ నుంచి ఇప్పటి వరకు ఎలాంటి ప్రతిపాదన రాలేదని చెప్పారు. ప్రతిపాదన వస్తే ఆలోచిస్తామని ఆయన అభిప్రాయపడ్డారు. రాజ్యసభకు బలమైన ఆశావహులు ఏపీ నుంచి ఉన్నారని చెప్పారు. కార్యకర్తలకు, నాయకులకు అందరికీ ఆరోగ్యబీమా ఇచ్చే ప్రయత్నం చేస్తున్నామన్నారు.

కాగా, తెలంగాణ నేత మోత్కుపల్లి నర్సింహులు బుధవారం ఉదయం ఏపీ సీఎం చంద్రబాబును కలిసి రాజ్యసభకు తనను పరిగణలోకి తీసుకోవాలన్నారు. ఆలోచిద్దామని చంద్రబాబు చెప్పారు. అయితే, తెలంగాణ నేతలకు మాత్రం రాజ్యసభ ఇచ్చే అవకాశాలు కనిపించడం లేదు.
అంతకుముందు కూడా ఓసారి రేవంత్ రెడ్డి అధినేత చంద్రబాబుకు రాజ్యసభ విషయమై ఓ సూచన చేశారు. ఓ స్థానాన్ని తెలంగాణ నేతలకు ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. ఆలోచిద్దామని, ఏపీలో పోటీ తీవ్రంగా ఉన్నందున కుదిరే అవకాశం లేదని చంద్రబాబు అప్పుడే చెప్పేశారు. అయితే, బీజేపీకి ఇవ్వకుండే తెలంగాణ నేతలకు ఇస్తారని రేవంత్ రెడ్డి, మోత్కుపల్లి వంటి వారు భావించారు. కానీ తెలంగాణ నేతలకు ఇచ్చేది లేదని లోకేష్ తేల్చేశారు.












Click it and Unblock the Notifications