నో స్పెషల్ స్టేటస్: జగన్ లేఖకు కేంద్రం రిప్లై, చంద్రబాబుకు షాక్
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇచ్చే విషయాన్ని ప్రధాని కార్యాలయం (పిఎంవో) తేల్చేసింది. ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేమని స్పష్టం చేసింది. వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి రాసిన లేఖకు పిఎంవో తరఫున వాణిజ్య శాఖ సమాధానం ఇచ్చింది. జగన్ లేఖకు ప్రధాని తరఫున ఆసిస్ దత్తా సమాధానం ఇచ్చారని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ పార్లమెంటు సభ్యుడు మిథున్ రెడ్డి చెప్పారు.
శనివారం మీడియా ప్రతినిధుల సమావేశంలో ఆ జగన్ లేఖకు కేంద్రం నుంచి వచ్చిన లేఖను ఆయన చదివి వినిపించారు. రాష్ట్రాన్ని పారిశ్రామికంగా అభివృద్ధి చేసుకోవాలని కేంద్రం స్పష్టం చేసింది. కేంద్రం రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వడం లేదని కేంద్రం స్పష్టంగా చెప్పిందని మిథున్ రెడ్డి వెల్లడించారు.

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా సాధించే సత్తా చంద్రబాబుకు ఉందా అని ఆయన అడిగారు. ప్రత్యేక హోదాపై చంద్రబాబు ఎందుకు మాట్లాడడం లేదని ఆయన అడిగారు. ప్రత్యేక హోదా సాధించేందుకు పోరాటం చేయడానికి తాము సిద్ధంగా ఉన్నామని అంటూ తెలుగుదేశం పార్టీ సిద్ధపడుతుందా అని ఆయన అడిగారు.
విభజన చట్టంలోని అన్ని హామీలను అమలు చేస్తున్నామని కేంద్రం రాసిన లేఖలో స్పష్టం చేశారు. అన్ని రాష్ట్రాలతో సమానంగానే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి న్యాయం చేస్తామని కేంద్రం తెలిపింది.
ఎపికి ప్రత్యేక హోదా ఇవ్వలేం కాబట్టి ప్రోత్సాహకాలు ఇవ్వలేమని కేంద్రం స్పష్టం చేసింది. ఇవ్వాల్సిన ప్రోత్సహకాలు ఇప్పటికే ఇచ్చామని, అందువల్ల కొత్తగా ఏమీ ఇవ్వబోమని కేంద్రం తెలిపినట్లు మిథున్ రెడ్డి వెల్లడించారు. కేంద్రం స్పష్టంగా చెప్పినా టిడిపి ఎంపీలు ఎందుకు స్పందించడం లేదని ఆయన అడిగారు. తాము ఈ నెల 29వ తేదీన తలపెట్టిన రాష్ట్ర బంద్‌కు ప్రజలంతా సహకరించాలని ఆయన కోరారు.












Click it and Unblock the Notifications