వేగవంతమైన అలర్ట్స్ కోసం
వెంటనే సబ్‌స్క్రైబ్ చేసుకోండి  
వేగవంతమైన అలర్ట్స్ కోసం
నోటిఫికేషన్స్ పై క్లిక్ చేయండి  
For Daily Alerts
Oneindia App Download

టిడిపి 'హోదా'కి బిజెపి 'విభజన' కౌంటర్, చిక్కు తెచ్చిన జేసీ: ఆత్మరక్షణలో బాబు

By Srinivas
|
Google Oneindia TeluguNews

విజయవాడ: ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వలేమని కేంద్రం తేల్చేసింది. కానీ ఏపీ సీఎం చంద్రబాబు మాత్రం ఇంకా వేచి చూసే ధోరణిలో కనిపిస్తున్నారు. ఓ వైపు హోదా ఇచ్చే పరిస్థితి లేదని కేంద్రం చెబుతున్నా... టిడిపి నేతలు మాత్రం ఓ వైపు బిజెపిని టార్గెట్ చేస్తూనే మరోవైపు ఇంకొందరు ఒప్పించే ప్రయత్నం చేస్తామంటున్నారు.

చంద్రబాబు చెబితేనో, తెలుగుదేశం పార్టీ చెబితేనో కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి అంగీకరించే పరిస్థితులు ఏమాత్రం కనిపించడం లేదని అంటున్నారు. అందుకు పలు కారణాలు కూడా ఉన్నాయని అంటున్నారు. ఇప్పటికే తెలంగాణలో టీడీపీకి దూరంగా ఉంటన్న బీజేపీ ఏపీలోను దూరం కావాలనే భావనతో ఉంది.

అందుకే ఆ పార్టీ నేతలు పురంధేశ్వరి, కన్నా లక్ష్మీనారాయణ, సోము వీర్రాజు తదితర నేతలు కొద్ది రోజుల క్రితం వరకు చేసిన విమర్శలే నిదర్శనం. కేంద్రం ఇస్తున్న నిధుల పైన చంద్రబాబు, టిడిపి నేతలు నిలదీసిన పలు సందర్భాల్లో వారు... కౌంటర్ ఇచ్చేవారు.

No Special Status To AP: Chandrababu in self defence

కేంద్రం ఇచ్చిన నిధులను చంద్రబాబు పక్కదారి పట్టిస్తున్నారని, వాటికి లెక్కలు చెప్పాలని, కేంద్రం వేటికి నిధులు ఇస్తే వాటికే ఖర్చు చేయాలని వారు పలుమార్లు డిమాండ్ చేశారు. నిధుల పైన టిడిపి నేతలు చేసిన ప్రతి దానికి వారు కౌంటర్ ఇచ్చేవారు.

వారం రోజులుగా ప్రత్యేక హోదా పైన మాత్రమే బిజెపి నేతలు పెద్దగా స్పందించడం లేదు. తాము హామీ ఇచ్చామని, కచ్చితంగా హోదా ఇస్తామని అంతకుముందు వారు చెప్పారు. కానీ కేంద్రమంత్రుల ప్రకటన అనంతరం వారు ఎక్కువగా బయటకు రావడం లేదు.

అదే సమయంలో, హోదా విషయంలో టిడిపి నేతలు చేస్తున్న ఘాటైన విమర్శలకు బిజెపి నేతలు కొందరు అంతే ధాటిగా సమాధానం చెబుతున్నారు. తద్వారా కొంతలో కొంత చంద్రబాబు పైన పైచేయి సాధించే ప్రయత్నాలు చేస్తున్నారు. హోదా విషయంలో తమనే పూర్తిగా తప్పుపట్టలేరని ప్రజల ముందుకు వస్తున్నారు.

ప్రత్యేక హోదా విషయంలో ఆత్మరక్షణలో పడిన బీజేపీ కాంగ్రెస్ పార్టీపై ధ్వజమెత్తుతోంది. హోదాను కాంగ్రెస్ పార్టీయే చట్టంలో పెట్టలేదని, పెడితే బాగుండేదని, అది కాంగ్రెస్ పార్టీ చేసిన తప్పు అని చెబుతున్నారు. టిడిపి కూడా ఆ వ్యాఖ్యలతో ఏకీభవించింది.. ఏకీభవిస్తోంది.

No Special Status To AP: Chandrababu in self defence

కానీ, హోదాపై కేంద్రమంత్రుల ప్రకటన తర్వాత.. టిడిపి నేతలు తమను తప్పుపట్టే విషయాన్ని మాత్రం కమలం పార్టీ సీరియస్‌గానే తీసుకుంటుంది. టిడిపి నేతల విమర్శలకు జవాబులు ఘాటుగా స్పందిస్తోంది. అసలు రాష్ట్ర విభజనకు అనుకూలంగా లేఖ ఇచ్చింది ఎవరో అందరికీ తెలుసునని కమలం పార్టీ చంద్రబాబును టార్గెట్ చేసింది.

రాష్ట్ర విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ ఇచ్చారని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీలు ఎప్పటి నుంచో విమర్శలు చేస్తున్నాయి. దీనిని బీజేపీ ఇప్పటిదాకా పెద్దగా ప్రస్తావించలేదు. కానీ, హోదా విషయంలో తమను టార్గెట్ చేయడంతో 'విభజనకు అనుకూలంగా చంద్రబాబు లేఖ' అస్త్రాన్ని తెరపైకి తెచ్చింది.

చంద్రబాబు తెలంగాణకు అనుకూలంగా రెండుసార్లు లేఖ ఇచ్చారని, మిగతా ఎక్కువ పార్టీలు కూడా అనుకూలంగా ఇచ్చాయని, ఆ కారణంగానే తాము విభజన చేయాల్సి వచ్చిందని కాంగ్రెస్ పార్టీ మొదటి నుంచి చెబుతోంది. ఇప్పుడు హోదాకు కౌంటర్‌గా బీజేపీ అదే ఆయుధాన్ని ఉపయోగిస్తోంది.

అంతేకాదు, కేంద్రం నుంచి వచ్చే నిధుల విషయంలో చంద్రబాబు పలుమార్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. అయితే, స్వయంగా ఆ పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి మాత్రం కేంద్రం నుంచి నిధులు రాలేదనడం సరికాదని అభిప్రాయం వ్యక్తం చేసి చంద్రబాబును చిక్కుల్లోకి నెట్టారు.

బీజేపీ సంధించిన ప్రశ్నలకు కూడా చంద్రబాబు వద్ద సమాధానాలు లేవని అంటున్నారు. కేంద్రం ఇచ్చిన నిధులను బాబు పక్కదారి పట్టించారని, వాటికి లెక్కలు చెప్పడం లేదని నిలదీశారు. వాటిపై టిడిపి ఇప్పటి దాకా సూటిగా సమాధానం చెప్పలేదు.

హామీల విషయానికి వస్తే.. చంద్రబాబు ఎన్నికల్లో ఎన్ని హామీలు ఇచ్చారు, ఎన్ని నెరవేర్చారని ప్రశ్నిస్తున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి ఉద్యోగాలు ఇచ్చారు, ఎంత రుణమాఫీ చేశారో చెప్పాలని నిలదీస్తున్నారు. తమను కార్నర్ చేయాలని చూస్తే తాము ఎదురుదాడికి సిద్ధమేనని బీజేపీ నేతలు హెచ్చరిస్తున్నారు.

బీజేపీని బాబు ఒప్పించగలరా?

హోదా ఇవ్వలేమని కేంద్రం దాదాపు తేల్చినప్పటికీ.. తాము ఒప్పిస్తామని చెబుతూ చంద్రబాబు బీజేపీతో దోస్తీకే మొగ్గు చూపుతున్నారు. చంద్రబాబు నుంచి దూరం జరిగేందుకు ప్రయత్నిస్తున్న బిజెపి ఆయన మాట వినే అవకాశాలు ఏమాత్రం లేవని అంటున్నారు.

విభజన నేపథ్యంలో ఏపీకి ఎన్నో ఆర్థిక కష్టాలు ఉన్నాయి. వాటిని నెరవేర్చాలంటే.. పెద్ద ఎత్తున నిధులు అవసరం. వాటిని ఇచ్చి ఆ క్రెడిట్ టిడిపితో పంచుకునేందుకు బిజెపి ఇష్టపడదు. చంద్రబాబు మిత్రపక్షంగా ఉన్నంత వరకు తాము ఏపీలో పెద్దగా ఎదిగే పరిస్థితి కూడా ఉండదు. ఇటు నిధులు ఇచ్చిన క్రెడిట్ లేక పార్టీ ఎదగకుండా... బీజేపీకి వచ్చేదేం లేదు. కాబట్టి, హోదాపై తాము ఒప్పిస్తామని చెబుతున్న బాబు వాదనలో పసలేదంటున్నారు.

English summary
Is AP CM Chandrababu Naidu in self defence on Special Status issue.
న్యూస్ అప్ డేట్స్ వెంటనే పొందండి
Enable
x
Notification Settings X
Time Settings
Done
Clear Notification X
Do you want to clear all the notifications from your inbox?
Settings X