టర్నుల్లేవ్: తెలంగాణే కావాలన్న కిషన్ రెడ్డి
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకే కట్టుబడి ఉన్నామని భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణపై తమ పార్టీ యూటర్న్ తీసుకుంటున్నట్లు వస్తున్న వార్తల్లో నిజం లేదని, తమది యూటర్న్ కాదని టీ టర్నేనని స్పష్టం చేశారు. కాంగ్రెస్, తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలకు చెందిన పలువురు నాయకులు శుక్రవారం బిజెపిలో చేరారు. ఈ సందర్భంగా కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడారు.
మిగితా పార్టీల్లా రోజుకో మాట మార్చబోమని, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు కట్టుబడి ఉన్నామని కిషన్ రెడ్డి చెప్పారు. తమ పార్టీ చిన్న రాష్ట్రాల ఏర్పాటుకు అనుకూలమని, తెలంగాణ విషయంలో వెనక్కితగ్గేది లేదని ఆయన తెలిపారు. కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ, వైయస్సార్ కాంగ్రెస్ పార్టీల వైఖరి చూసి ఊసరవెల్లులు సైతం సిగ్గుపడుతున్నాయని ఆరోపించారు. హైదరాబాద్ పై మూడు ఆప్షన్లంటున్న కాంగ్రెస్ కు ప్రజలు తగిన గుణపాఠం చెబుతారని అన్నారు.

వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోతుందని, యూపిఏ అధ్యక్షురాలు సోనియాగాంధీ, రాహుల్ గాంధీలు కూడా ఓటమి పాలయ్యే నాయకుల జాబితాలో ఉన్నారని చెప్పారు. సిపిఐ రాష్ట్ర కార్యదర్శి నారాయణ, సిపిఎం రాష్ట్ర నేత రాఘవులు తమ పార్టీపై చేసిన విమర్శలకు సమాధానమిచ్చారు.
గణేష్ ఉత్సవాల్లో తాము రాజకీయం చేయలేదని, తమ పార్టీ జెండాలు గానీ, నాయకుల ఫొటోలు గానీ ప్రదర్శించలేదని తెలిపారు. నరేంద్ర మోడీ నాయకత్వంలో జాతీయావత్తు బలపడుతుందనే భావంతోనే కొందరు యువకులు మోడీ ఫొటోలను ప్రదర్శించారని స్పష్టం చేశారు. భారత యువత వచ్చే ఎన్నికల్లో నరేంద్ర మోడీని ప్రధానిగా చూడాలనుకుంటోందని తెలిపారు.












Click it and Unblock the Notifications