డిగ్గీకి మాటలకు విలువలేదు: గంటా, పోరు: శీలం
విశాఖపట్నం/ ఒంగోలు: రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జి దిగ్విజయ్ సింగ్ మాటలకు విలువలేదని , దిగ్విజయ్ సింగ్ చెప్పేది ఒకటి ఇక్కడ జరిగేది మరొకటి అని సీమాంధ్రకు చెందిన రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావు అన్నారు. శనివారం ఉదయం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి తన పని తాను చేసుకుపోతున్నారని చెప్పారు.
విభజనపై లోకసభ స్పీకర్, రాష్ట్రపతి, సుప్రీంకోర్టులకు అఫిడవిట్లు పంపుతామని ఆయన వెల్లడించారు.ఈ అసెంబ్లీ సమావేశాల తర్వాత వెలువడే నిర్ణయాన్ని బట్టి ఏం చేయాలనే విషయంపై నిర్ణయం తీసుకుంటామని మంత్రి గంటా చెప్పారు.
సీమాంధ్రుల హక్కులను కాపాడేందుకు చివరి వరకు పోరాడుతాం కేంద్రమంత్రి జేడీ శీలం స్పష్టం చేశారు. శనివారంనాడు ఆయన మీడియాతో మాట్లాడారు. విభజనపై కేంద్రం సీమాంధ్రుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోలేదని జేడీ శీలం మండిపడ్డారు. తాము పోరాటం చేస్తున్నామని, ఎంత వరకు సఫలీకృతమవుతామనేది చెప్పలేమని ఆయన అన్నారు.
తాము చివరి వరకూ పోరాడి సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిగేలా చూస్తామని ఆయన హామీ ఇచ్చారు. కాంగ్రెసులో పదవులు అనుభవించి ఇప్పుడు అదే పార్టీపై నిందలు వేయడం సరైన పద్ధతి కాదని ఆయన అన్నారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధుల మనోభావాలను పరిగణనలోకి తీసుకోకుండా అధిష్టానం ఏకపక్షంగా రాష్ట్ర విభజన నిర్ణయాన్ని తీసుకుందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications