డాక్టర్లే కాదు...ఇకపై వీళ్లు కూడా మందులు రాయొచ్చు:ఎన్‌ఎంసీ నిర్ణయం
అమరావతి:మన దేశంలో ఇప్పటివరకు పేషెంట్లకు డాక్టర్లు మాత్రమే మందులు రాసేవాళ్లు. అయితే ఈ విధానంలో ఒక పెను మార్పు చోటుచేసుకోనుంది. ఇకపై డాక్టర్లతో పాటు ప్రత్యేక శిక్షణ పొందిన ఫార్మసిస్ట్‌లు, ఫిజీషియన్ అసిస్టెంట్‌లు, ఆప్టోమెట్రిస్ట్‌లు, ఆఫ్తాల్మజీ అసిస్టెంట్‌లకు కూడా రోగులకు మందులు రాసే అవకాశం దక్కనుంది.
ఈ మేరకు నేషనల్ మెడికల్ కమిషన్ (ఎన్‌ఎంసీ) ఒక బిల్లును రూపొందించగా దానికి పార్లమెంట్ సైతం ఆమోద ముద్ర వేసింది. ఆమేరకు త్వరలోనే వీరికి లైసెన్సులు జారీ చేయనున్నట్లు తెలిసింది. ఆ తర్వాత వీరంతా లైసెన్స్‌డ్ నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లగా నిర్దేశిత వైద్య సేవలను అందించే అవకాశం కల్పిస్తారు. తద్వారా గ్రామీణ ప్రాంతాల్లో వైద్యుల కొరతను అధిగమించవచ్చని ఎన్‌ఎంసీ భావిస్తోంది. అయితే ఎన్‌ఎంసీ తీసుకున్న ఈ నిర్ణయంపై వైద్య సంఘాలు మండిపడుతున్నాయి. మరోవైపు ఫార్మసీ సంఘాలు మాత్రం ఈ నిర్ణయం పట్ల సానుకూలంగా స్పందిస్తుండటం గమనార్హం.

నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్‌కు...త్వరలోనే లైసెన్సులు
నేషనల్ మెడికల్ కమిషన్ నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లకు త్వరలో లైసెన్సులు జారీ చేసేందుకు ముమ్మరంగా కసరత్తు చేస్తోంది. అలాగే వీరితో పాటు ఐసీయూ విభాగంలో ప్రత్యేక శిక్షణ పొందిన నర్సులకు కూడా మందులు రాసే అవకాశం ఉంటుంది. అయితే డాక్టర్ల లాగే మందులు రాసే అవకాశం ఉన్నప్పటికీ వీరు అన్ని మందులు రాసే అవకాశం ఉండదు. కొన్ని మందులు రాయడానికి మాత్రమే వీరికి అనుమతి ఉంటుంది...అది కూడా ప్రాథమిక వైద్యం, ప్రివెంటివ్ మెడిసిన్ విభాగంలోకి వచ్చే మందులు మాత్రమే వీరు రాయాల్సి ఉంటుంది. అలాగే వీరికిచ్చే లైసెన్సులను ఎన్‌ఎంసీ పరిధిలోని నైతిక విలువల కమిటీ పర్యవేక్షిస్తుందని తెలిసింది.

మందులు...ఎప్పుడు రాయాలంటే?
అయితే నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లు మందులు రాయాలంటే కొన్ని నిబంధనల మేరకే సాధ్యపడుతుంది. వీళ్లు ప్రధానంగా ఓవర్ ద కౌంటర్ డ్రగ్స్ విషయంలోనే ఈ మందులు రాయాలి. అంటే వైద్యుడు లేని చోట...లేదా లేని సమయంలో నేరుగా మందుల షాపునకు వెళ్లి తెచ్చుకునేవారికి మాత్రమే వీళ్లు మందులు ఇవ్వవచ్చు. అది కూడా ప్రాథమిక స్థాయిలో కొన్ని మందులకు మాత్రమే వీరు ప్రిస్కిప్షన్ ఇవ్వడానికి వీలవుతుంది. ఉదాహరణకు పల్లెటూరిలో ఓ వ్యక్తి జ్వరం, మలేరియా, టైఫాయిడ్ వంటి వాటికి గురైనప్పుడు అక్కడ ఎంబీబీఎస్ డాక్టర్ లేనప్పుడు ఇలాంటి నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లు మందులు ఇస్తారు. వీరు ఇష్టారాజ్యంగా మందులు రాయకుండా ఎన్‌ఎంసీ వారిని పర్యవేక్షిస్తుంది. అది కూడా వీరికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన తర్వాత మాత్రమే లైసెన్సులు ఇవ్వడం జరుగుతుంది. ఈ నిబంధనలు ఎవరైనా ఉల్లంఘిస్తే చర్యలు తీసుకునేందుకు ఎథిక్స్ కమిటీ ఉంటుంది.

దుర్వినియోగం...అవకాశాలు
అయితే ఇలా నాన్ మెడికల్ ప్రాక్టీషనర్లకు అనుమతులివ్వడం దుర్వినియోగం కావడం ఖాయమని వైద్య వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. అసలు ఇప్నటికే ఆర్‌ఎంపీలు, ప్రైవేటు మెడికల్ ప్రాక్టీషనర్స్ (పీఎంపీలు) ఇష్టారాజ్యంగా యాంటీబయోటిక్స్ సైతం రాసేస్తున్నారని, ఇక నాన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కూడా మందులు రాయడం మొదలు పెడితే దాన్ని కనిపెట్టి అరికట్టగల వ్యవస్థ మన దగ్గర ఉందా అని వైద్య వర్గాలు ప్రశ్నిస్తున్నాయి. ఇప్పటికే ఇలా రాస్తున్న మందుల కారణంగా వేలాది మంది రోగులు మోతాదులపై అవగాహన లేక, అనవసరంగా వాడకూడని మందులు వాడుతూ కిడ్నీ వ్యాధులకు గురవుతున్నారని వారు చెబుతున్నారు. వీటిపై ఇప్పటివరకూ చర్యలు లేవని, ఇకపై తీసుకుంటారన్న నమ్మకం లేదని వైద్య వర్గాలు చెబుతున్నాయి. అసలు అమెరికా, ఫ్రాన్స్, కెనడా, బ్రిటన్ వంటి దేశాల్లో డాక్టర్‌కు మినహా మరెవరికీ మందులు రాసే అవకాశమే లేదనే విషయాన్ని వారు గుర్తు చేస్తున్నారు.

కొత్త నిర్ణయం...భిన్నాభిప్రాయాలు...
అయితే ప్రధానంగా డాక్టర్ల కొరత తీర్చేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఎన్‌ఎంసీ వాదిస్తోంది. ఇక ఎపి విషయానికొస్తే రాష్ట్రాన్ని డాక్టర్ల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ మార్గదర్శకాల ప్రకారం ప్రతి వేయి మందికి ఒక ఎంబీబీఎస్ డాక్టర్ ఉండాలి. కానీ మన రాష్ట్రంలో ప్రతి 1700 మందికి కూడా ఒక డాక్టర్ లేరు. స్పెషలిస్టు డాక్టర్ల సేవలు పట్టణాలకే అది కూడా కేవలం 30 శాతం మందికి మాత్రమే పరిమితం. గ్రామీణులు స్పెషలిస్ట్ డాక్టర్ సేవలు పొందాలంటే కనీసం 40,50 కి.మీ రావాల్సిందే. అందుకే ఇప్పటికీ చాలాచోట్ల గ్రామీణులు ఆర్‌ఎంపీ, పీఎంపీల వైద్యంపైనే ఆధారపడి చికిత్సలు పొందుతున్నారు. అయితే ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఈ విధానం గురించి ఏమంటున్నారంటే...రోగులకు ఇష్టారాజ్యంగా మందులు రాయడంతో తీవ్ర దుష్ఫరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. అవసరం లేకపోయినా బాగా బలమైన మందులు ఇవ్వడం వల్ల శరీరంలో వ్యాధి నిరోధక శక్తి తగ్గిపోతోంది. శరీరానికి ఎంత మోతాదులో మందులు ఇవ్వాలో డాక్టర్లకే తెలుసు. ఇలా ఎవరు పడితే వాళ్లు మందులిస్తే రోగులు తీవ్రంగా నష్టపోతారని స్పష్టం చేస్తున్నారు.












Click it and Unblock the Notifications