సీటుపై ఎత్తులు పైయెత్తులు: కోదండపై తెరాసVsబిజెపి

తెరాస తరఫున సికింద్రాబాద్ లోక్‌సభ స్థానం నుంచి బరిలోకి దిగాలంటూ కోదండరామ్‌కు కెసిఆర్ ఆఫర్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఇందుకు కోదండ తిరస్కరించారు. అయితే, కెసిఆర్ ఆఫర్లోని అంతరార్థాన్ని బిజెపి గుర్తించింది. ఇది బిజెపిని దెబ్బతీసేందుకు కెసిఆర్ పన్నిన ఎత్తుగడగా భావిస్తోంది. వాస్తవానికి నూటికి నూరు శాతం తాము గెలిచే అవకాశం ఉందని బిజెపి భావిస్తున్న లోక్‌సభ సీట్లలో సికింద్రాబాద్ ఒకటి.
ఇక్కడి నుంచి బండారు దత్తాత్రేయ లేదా కిషన్ రెడ్డి పోటీలో ఉంటారన్న ప్రచారం సాగుతోంది. ఇక్కడ కోదండరామ్‌ను బరిలోకి దింపి తమను దెబ్బతీయవచ్చన్న వ్యూహంతోనే కెసిఆర్ ఈ ఎత్తుగడ వేశారని బిజెపి భావిస్తోంది. కోదండరామ్ పోటీకి ఒప్పుకొంటే బిజెపి అభ్యర్థి కూడా పోటీ నుంచి హుందాగా తప్పుకొనే అవకాశం ఉండవచ్చన్నదే కెసిఆర్ వ్యూహమని అంచనా వేస్తున్నారు.
తెరాస, మజ్లిస్ మధ్య పొత్తు దాదాపుగా ఖరారైందన్న వార్తలు వెలువడుతున్న నేపథ్యంలో సికింద్రాబాద్ నుంచి బిజెపిని తప్పిస్తే.. మజ్లిస్‌తో బంధం మరింత బలపడుతుందన్నది తెరాస వ్యూహమని, రాజధాని నగరంలోనే బిజెపిని వ్యూహాత్మకంగా దెబ్బకొడితే ఆ ప్రభావం తెలంగాణలోని మిగతా లోకసభ స్థానాలపై కూడా పడుతుందన్నది తెరాస ఆలోచనగా కమలనాథులు భావిస్తున్నారు. దీంతో, బిజెపి కూడా ఈ అంశాన్ని సీరియస్‌గా తీసుకుంటోంది.
బిజెపి లేకపోతే తెలంగాణ వచ్చేది కాదని, తమ పైన ఇలాంటి ప్లాన్లు చేయడం సరికాదని బిజెపి భావిస్తోంది. ఇందుకు పైయెత్తులు వేస్తోంది. ఈ నేపథ్యంలోనే, తాము కూడా కెసిఆర్‌ను దెబ్బకు దెబ్బ తీయాలన్న నిర్ణయానికి వచ్చినట్లు తెలిసింది. కెసిఆర్ పోటీ చేయాలనుకుంటున్న మెదక్ లోకసభ స్థానం నుంచి కోదండరామ్ బరిలోకి దిగాలన్న ప్రతిపాదనను ఆయన ముందు పెట్టబోతోంది. ఏ పార్టీ తరపున అన్నది ముఖ్యం కాదని, ఆయన పోటీ చేస్తే మెదక్ సీటే మేలని బిజెపి వాదిస్తోంది.
ఈ మేరకు బిజెపి తెలంగాణ ఉద్యమ కమిటీ నేతలు ఈ ప్రతిపాదనను కోదండరామ్‌కు వివరించేందుకు సంసిద్ధమవుతున్నారు. గురువారం రాత్రి కోదండరామ్‌ను కలిసి ఈ ప్రతిపాదనను ముందుంచినట్లుగా తెలుస్తోంది. అలాగే, కోదండరామ్‌ను మెదక్ నుంచి పోటీకి దింపితే బాగుంటుందన్న ఆలోచనను టిజెఏసి ముందు ఉంచనున్నట్లు సమాచారం. దీంతో కెసిఆర్‌ను మెదక్ నుంచి తప్పుకొనేట్లు చేయడమే కాకుండా.. సికింద్రాబాద్ ప్రతిపాదనను తిప్పికొట్టినట్లు అవుతుందన్నది బిజెపి భావన.
సికింద్రాబాద్‌లో సెటిలర్లు ఎక్కువగా ఉన్నారని, తెలంగాణవాదం అంతగా ఉండదని చెప్పబోతున్నారు. సికింద్రాబాద్ కంటే మెదక్‌లోనే తెలంగాణవాదం బలంగా ఉందని, కెసిఆర్ సొంత జిల్లా కావడంతో ఎక్కువ ఆదరణ లభిస్తుందని వివరించబోతున్నారు. అయితే, తాను ఎన్నికల్లో పోటీ చేయబోనంటూ కోదండరామ్ ఇప్పటికే స్పష్టం చేశారు. కానీ, ఫలానా పార్టీ నుంచి అని కాకుండా కేవలం తెలంగాణ జెఏసి నుంచి పోటీకి అవకాశమిస్తే పోటీ చేస్తానని, ఆయా పార్టీలు తమ అభ్యర్థులను రంగంలోకి దింపకపోతేనే పరిశీలిస్తానని కోదండరామ్ అన్నారట.












Click it and Unblock the Notifications