TTD: శ్రీవారి ఆలయంలో దీపావళి వేళ - శాస్త్రోక్తంగా..!!
దేశ వ్యాప్తంగా దీపావళి సందడి కొనసాగుతోంది. తిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం ఉదయం దీపావళి ఆస్థానం శాస్త్రోక్తంగా జరిగింది. ఆలయ అర్చకులు, తిరుమల జీయంగార్లు, టీటీడీ ఉన్నతాధికారుల సమక్షంలో బంగారువాకిలి చెంత ఆగమోక్తంగా ఆస్థాన వేడుకను నిర్వహించారు.
దీపావళి ఆస్థానం
శ్రీవారి ఆలయంలో దీపావళి పండుగ సందర్భంగా దీపావళి ఆస్థానాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించిట్లు ఈవో శ్యామలరావు తెలిపారు. రాష్ట్రం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో ఉండాలని స్వామివారిని ప్రార్థించినట్టు చెప్పారు. ఈ దీపావళి ప్రజలందరి జీవితాల్లో వెలుగులు నింపాలని, ఆయురారోగ్య ఐశ్వర్యాలతో ఉండాలని ఈవో ఆకాంక్షించారు. శ్రీవారి ఆలయ ప్రధానార్చకుల్లో ఒకరైన వేణుగోపాల దీక్షితులు మాట్లాడుతూ భక్తులందరికీ శ్రీవారి ఆశీస్సులు అందాలని కోరుతూ దీపావళి ఆస్థానం నిర్వహించినట్లు చెప్పారు.

మాడ వీధుల్లో ఊరేగింపు
ఈ సందర్భంగా స్వామివారి మూలమూర్తికి, ఉత్సవమూర్తులకు నూతన పట్టువస్త్రాలు అలంకరించినట్టు తెలిపారు. అంతకుముందు ఆలయంలో మూలవిరాట్టుకు, ఉత్సవమూర్తులకు నూతన పట్టు వస్త్రాలు సమర్పించి రూపాయి హారతి, ప్రత్యేక హారతులను నివేదించారు. సాయంత్రం స్వామి, అమ్మవార్లు సహస్ర దీపాలంకరణ సేవలో పాల్గొని ఆలయ నాలుగు మాడ వీధులలో ఊరేగి భక్తులను కటాక్షించనున్నారు. తిరుమల శ్రీవారి దర్శనార్థం దేశ విదేశాల నుండి విచ్చేసే లక్షలాది మంది భక్తులకు రుచిగా, శుచిగా ఒక రోజు అన్నప్రసాదాలు అందించేందుకు టిటిడి ఎస్వీ అన్నప్రసాదం ట్రస్టు ఒక రోజు విరాళ పథకం ప్రారంభించింది.
అన్న ప్రసాద విరాళాలు
ప్రస్తుతం అన్నప్రసాద వితరణ కోసం విరాళాల మేరకు ఒక రోజు పూర్తిగా అన్నప్రసాద వితరణ - రూ.44 లక్షలు చెల్లించాల్సి ఉంటుంది. అదేవిధంగా ఉదయం అల్పాహారం కోసం - రూ.10 లక్షలు, మధ్యాహ్న భోజనం కోసం - రూ.17 లక్షలు, రాత్రి భోజనం కోసం - రూ.17 లక్షలు అందించి దాతలు స్వయంగా భక్తులకు అన్నప్రసాదాలు వడ్డించవచ్చు. విరాళం అందించే దాత పేరును వెంగమాంబ అన్నప్రసాద భవనంలో ప్రదర్శిస్తారు. అదేవిధంగా దాతలు తమ కోరిక మేరకు ఒకరోజు ఇక్కడ అన్నప్రసాదాలు వడ్డించే అవకాశాన్ని పొందొచ్చు.












Click it and Unblock the Notifications